రాజమండ్రి జైలులో మరో ఖైదీ మృతి.. కారణం ఏంటంటే..?
ఓవైపు చంద్రబాబుకి ఆరోగ్య సమస్యలున్నాయి. దోమలు కుడుతున్నాయని, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అక్కడ ఖైదీ చనిపోవడంతో కలకలం రేగింది.
రాజమండ్రి సెంట్రల్ జైలు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. ఆ జైలులో చీమ చిటుక్కుమన్నా వార్తే, ఖైదీ అనారోగ్యంపాలయినా, జైలరు సెలవు పెట్టినా వార్తే. ఇప్పుడో ఖైదీ మృతితో మరోసారి రాజమండ్రి జైలు వార్తల్లోకెక్కింది. మృతుడి పేరు జోబాబు. వయసు 55 సంవత్సరాలు. హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2002నుంచి జైలులో ఉన్నాడు. అనారోగ్యంతో ముందు రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు, అక్కడి వైద్యుల సూచనల మేరకు కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జోబాబు చనిపోయాడు. కాకినాడకు చేర్చేనాటికి పక్షవాతం వచ్చింది. నరాల సమస్యలు, శ్వాసకోశ సమస్యలతోపాటు, గుండెపోటు రావడంతో చనిపోయాడని డాక్టర్లు అంటున్నారు.
చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత అక్కడ ఇది రెండో మరణం కావడం విశేషం. ఇదే విషయాన్ని ఎల్లో మీడియా హైలైట్ చేస్తోంది. గతంలో ఓ ఖైదీ అనారోగ్యంతో చనిపోయాడు. అప్పుడు కూడా హడావిడి జరిగింది. అతను డెంగీతో చనిపోయాడని, చంద్రబాబుకి కూడా దోమలు కుడుతున్నాయని ఎల్లో మీడియా రచ్చ చేసింది. ఇప్పుడు కూడా జోబాబు మృతిని హైలైట్ చేస్తున్నారు. ఓవైపు చంద్రబాబుకి ఆరోగ్య సమస్యలున్నాయి. దోమలు కుడుతున్నాయని, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అక్కడ ఖైదీ చనిపోవడంతో కలకలం రేగింది.
స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్ పొడిగించడంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఆశలు పెట్టుకున్నారు. హైకోర్టుకి దసరా సెలవలు కావడంతో ఆ పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందుకు వస్తోంది. మరోవైపు క్వాష్ పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. చంద్రబాబుకి అనారోగ్యం అంటూ కుటుంబ సభ్యులు సింపతీకోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించినట్టు లేవు. వైద్యబృందం చంద్రబాబుకి పరీక్షలు చేయడం, ప్రతి రోజూ హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో ఆయనకు ప్రమాదమేమీ లేదని తేలింది. బరువు తగ్గడం కూడా అవాస్తవం కావడంతో కుటుంబ సభ్యుల మాటల్ని ఎవరూ నమ్మడంలేదు. ఈ దశలో రాజమండ్రి జైలులో జోబాబు మరణం అనే వార్త కలకలం రేపింది.