రాజమండ్రి బ్రిడ్జ్ మూసివేత.. అమరావతి యాత్రలో మరో టెన్షన్..
అమరావతి యాత్ర మరో రెండు రోజుల్లో ఇక్కడకు చేరుకుంటుంది. సరిగ్గా యాత్ర ముందుగా వంతెన మూసివేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈరోజు నుంచి వారం రోజులపాటు రాజమండ్రిలోని రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మరమ్మతుల కోసమే ఈ మూసివేత అని చెబుతున్న అధికారులు ట్రాఫిక్ ని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ, గామన్ వంతెన మీదుగా మళ్లిస్తున్నామని అన్నారు. అయితే అమరావతి యాత్ర మరో రెండు రోజుల్లో ఇక్కడకు చేరుకుంటుంది. సరిగ్గా యాత్ర ముందుగా వంతెన మూసివేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పైకి అమరావతి యాత్ర వచ్చే సమయానికి హడావిడి మరింత పెంచాలని చూస్తున్నారు టీడీపీ నేతలు. యాత్రకు భారీ మద్దతు ఉందని నిరూపించడానికి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై పెద్ద సంఖ్యలో మద్దతుదారులతో కవాతు నిర్వహించాలనుకున్నారు. కానీ రెండు రోజుల ముందుగా బ్రిడ్జ్ మూసేశారు. దీంతో టీడీపీ నేతల ఆశలు నెరవేరేలా లేవు. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్తే హడావిడి తగ్గిపోతుంది. అందుకే ఉద్దేశపూర్వకంగానే యాత్ర రూటు మార్చారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు, అమరావతి రైతులు.
ఇప్పటికే అమరావతి యాత్రలో ఆందోళనలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. స్థానికులు నల్ల బెలూన్లతో యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి వారిని ఊరు దాటిస్తున్నారు. గోదావరి జిల్లాల్లోనే ఇలా ఉంటే, ఇక ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం అందరిలో ఉంది. దానికి తగ్గట్టుగానే ఉత్తరాంధ్రలో అమరావతి రైతుల్ని అడుగుపెట్టనివ్వబోమంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. దీంతో యాత్ర విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని పోలీస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా రాజమండ్రి బ్రిడ్జ్ మూసివేతతో మరోసారి యాత్ర విషయం హాట్ టాపిక్ గా మారింది.