Telugu Global
Andhra Pradesh

వాయు'గండం'.. 4 రాష్ట్రాలకు అలర్ట్

ఉత్తరాంధ్ర, యానాం తీరాలకు సమీపంలో సముద్ర కెరటాల ఉద్ధృతి అధికంగా ఉంటుందని, బుధ, గురువారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వాయుగండం.. 4 రాష్ట్రాలకు అలర్ట్
X

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. అది వాయుగుండంగా మారి ఈనెల 17న ఒడిశా తీరానికి చేరువ అవుతుందని వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.

అల్పపీడనంతోపాటు, ఆగ్నేయ బంగాళాఖాతం, శ్రీలంక తీరాలకు సమీపంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఏపీతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాబోయే అయిదు రోజుల్లో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, యానాం తీరాలకు సమీపంలో సముద్ర కెరటాల ఉద్ధృతి అధికంగా ఉంటుందని, బుధ, గురువారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

First Published:  15 Nov 2023 8:16 AM IST
Next Story