Telugu Global
Andhra Pradesh

రాహుల్ యాత్ర.. ఉలిక్కిపడ్డ ఏపీ బీజేపీ..

విభజన హామీలు తాము అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ని చూసి ఏపీ బీజేపీ ఉలిక్కిపడుతోంది. ప్రత్యేక హోదాపై కూడా కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో బీజేపీకి షాక్ తగిలినట్టయింది.

రాహుల్ యాత్ర.. ఉలిక్కిపడ్డ ఏపీ బీజేపీ..
X

భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని అమరావతి రైతులు వెళ్లి కలిశారు, తమ కష్టాలు చెప్పుకున్నారు. పోలవరం నిర్వాసితులు వెళ్లి కలిశారు, తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ వారికి ధైర్యం చెప్పి, విభజన హామీలపై కూడా క్లారిటీ ఇచ్చారు. విభజన హామీల అమలు బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదని, కానీ వారు ఆ బాధ్యత విస్మరించారని విమర్శించారు. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయం అని గతంలో జైరాం రమేష్ క్లారిటీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ తెగ ఇదైపోతోంది. కాంగ్రెస్ పై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.

ఆంధ్రులను ఎప్పుడూ కాంగ్రెస్ చులకనగానే చూసిందని, ఆంధ్రుల ఆత్మ గౌరవం అంటే ఎప్పుడూ వారికి చిన్నచూపేనని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. "ఆంధ్రులు మీ చేతిలో కీలుబొమ్మలు అనుకుంటే అది మీ పొరపాటే, మా జోలికి వస్తే బుద్ది చెప్పడం మాకు అలవాటే"నంటూ ట్విట్టర్లో పంచ్ డైలాగులు పేల్చారు. ఎనిమిదేళ్లుగా ఏపీ ప్రత్యేక హోదాని అటకెక్కించి దిగ్విజయంగా రాష్ట్రంలోని అధికార పార్టీలను బీజేపీ తన గుప్పెట్లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక విభజన హామీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కనీసం పోలవరం పూర్తయ్యేందుకు కూడా కేంద్రం మనస్ఫూర్తిగా సహకరించడంలేదు. ఈ దశలో విభజన హామీలు తాము అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ని చూసి బీజేపీ ఉలిక్కిపడుతోంది. ప్రత్యేక హోదాపై కూడా కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో బీజేపీకి షాక్ తగిలినట్టయింది.

అమరావతి రైతులు, పోలవరం నిర్వాసితులు రాహుల్ గాంధీ వ‌ద్ద‌కు వెళ్లి మొర పెట్టుకోవడం కూడా బీజేపీకి మింగుడు పడని వ్యవహారం. అందుకే సోము వీర్రాజు ట్విట్టర్లో రంకెలేస్తున్నారు. సొంత పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ తనపై అసంతృప్తి వెళ్లగక్కినా, దానికి సమాధానం ఇవ్వలేక, ఇలా రాహుల్ యాత్రపై బురదజల్లాలని చూస్తున్నారు వీర్రాజు.

First Published:  19 Oct 2022 3:31 PM IST
Next Story