రాహుల్ కూడా బీజేపీలో చేరిపోవచ్చు.. - విజయసాయిరెడ్డి సెటైర్లు
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణాన్ని కూడా విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా వివరించారు.
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఆ పార్టీని వదిలి సీనియర్ నేతలందరూ వెళ్లిపోతున్నారని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో నాయకుల కొరత ఎక్కువగా ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేపోమాపో రాహుల్‌గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని గురువారం ఉదయం ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్టు పెట్టారు.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీని వీడి సీనియర్ నేతలంతా తమదారి తాము చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నెలకొంటున్న ఈ పరిస్థితులతో కాంగ్రెస్ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు. ఇంకా ఆయన తన ట్వీట్‌లో.. కాంగ్రెస్ తన పునాదిని, అగ్రనేతలను కూడా కోల్పోయిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణాన్ని కూడా విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే ఆ పార్టీ ఇప్పుడు దేశమంతటా ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ పతనం దేశవ్యాప్తంగా వ్యాపించిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.