వైఎస్ఆర్ తో నా అనుబంధం.. రాహుల్ కథ జనం నమ్ముతారా..?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి రాజీవ్ గాంధీకి సోదరుడు వంటి వారని, వాళ్ళిద్దరిదీ రాజకీయ సంబంధం మాత్రమే కాదని వారు అన్నాతమ్ముళ్లలా కలసిమెలసి ఉండేవారని అన్నారు రాహుల్.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కి ఎంత చేశారో, ఏం చేశారో జనాలకు బాగా తెలుసు. ఏపీలో కాంగ్రెస్ ప్రాభవం తగ్గిపోతున్న దశలో పాదయాత్రతో ఆ పార్టీకి ఊపిరిలూదారు వైఎస్ఆర్. వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారు. కానీ ఆయన మరణానంతరం కాంగ్రెస్ అధిష్టానం అసలు రంగు బయటపడింది. వారసుడిగా జగన్ ని పార్టీ గుర్తించకపోయినా పర్లేదు, వైఎస్ఆర్ కి అవినీతి మకిలి అంటించింది. ఆయన్ని తిట్టిన వారినల్లా అందలమెక్కించింది. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ ఏపీలో వైఎస్ఆర్ జపం చేయడం విడ్డూరం. వైఎస్ఆర్ కుమార్తె షర్మిలకు పీసీసీ పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ పాప ప్రక్షాళణ చేసుకున్నట్టు అనుకోలేం. అయితే తాజాగా రాహుల్ గాంధీ మాటలు వింటే మాత్రం.. ఏపీలో వైఎస్ఆర్ అభిమానుల ఓట్ల కోసం ఆ పార్టీ ఎంతగా తాపత్రయపడుతుందో అర్థం చేసుకోవచ్చు.
రాజశేఖర్ రెడ్డి గారు నా తండ్రి రాజీవ్ గాంధీ గారి సోదరుడు. వారిద్దరు అన్నదమ్ముళ్లు లాగా కలిసి ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఏపీకే కాకుండా మొత్తం భారతదేశానికే మార్గదర్శకులయ్యారు.@RahulGandhi pic.twitter.com/hDSszNQEqe
— YS Sharmila (@realyssharmila) May 11, 2024
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి రాజీవ్ గాంధీకి సోదరుడు వంటి వారని, వాళ్ళిద్దరిదీ రాజకీయ సంబంధం మాత్రమే కాదని వారు అన్నాతమ్ముళ్లలా కలసిమెలసి ఉండేవారని అన్నారు రాహుల్. రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే మార్గదర్శకులని చెప్పారు. వైఎస్ఆర్ పాదయాత్ర తన జోడో యాత్రకు ప్రేరణ అని కూడా చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని ఆయన తనతో చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రేరణతోనే తాను పాదయాత్ర చేపట్టి విద్వేషపు ప్రాంతాల్లో కూడా ప్రేమను వికసింపజేశానన్నారు. రాజశేఖర్ రెడ్డి చేసిన రాజకీయం నేడు రాష్ట్రంలో లేదన్నారు రాహుల్.
అంతా బాగానే ఉంది కానీ, కాంగ్రెస్ నేతలకు సడన్ గా వైఎస్ఆర్ పై అభిమానం ఎందుకు పొంగుకొచ్చిందో అర్థం కావడంలేదు. వైఎస్ఆర్ ని అవమానించి, ఆయన కుటుంబాన్ని రోడ్డుపైకి వచ్చేలా చేసి, కేసులతో వేధించింది కాంగ్రెస్. ఒకరకంగా రాష్ట్ర విభజన పాపం కంటే, వైఎస్ ఫ్యామిలీపై వారు చూపిన ద్వేషమే ఏపీలో ఆ పార్టీకి నామరూపాల్లేకుండా చేసింది. మళ్లీ ఇప్పుడు వైఎస్ఆర్ పై వారు ప్రేమ ఒలకబోయడం ఎన్నికల స్టంట్ అని స్పష్టంగా తెలుస్తోంది. వైఎస్ఆర్ ని అభిమానించే ఎవరైనా ఆయన వారసుడిగా జగన్ ని గుర్తిస్తారు, మద్దతుగా నిలుస్తారు కానీ.. కాంగ్రెస్ ని దగ్గరకు రానిచ్చే అవకాశమే లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల వేళ వైఎస్ఆర్ ని రాహుల్ గాంధీ ఎంత పొగిడినా ఫలితం లేదంటున్నారు.