Telugu Global
Andhra Pradesh

న‌ర‌సాపురంలో ర‌ఘురామ కృష్ణంరాజే దిక్కా..? టీడీపీ క్యాడ‌ర్‌లో నైరాశ్యం

న‌ర‌సాపురంలో కొత్తప‌ల్లి సుబ్బారాయుడును అభ్య‌ర్థిగా నిలబెట్ట‌డం, లేదంటే పొత్తులో బీజేపీకి ఇవ్వ‌డం ఇలాగే గ‌త మూడు ద‌శాబ్దాలుగా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది.

న‌ర‌సాపురంలో ర‌ఘురామ కృష్ణంరాజే దిక్కా..? టీడీపీ క్యాడ‌ర్‌లో నైరాశ్యం
X

న‌రసాపురం లోక్‌స‌భ స్థానంలో తొలి నాళ్ల నుంచీ కాంగ్రెస్‌దే ఆధిప‌త్యం. మ‌ధ్య‌లో 1984 నుంచి 1996 వ‌ర‌కు టీడీపీ గెలిచినా ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప‌ట్టు కోల్పోయింది. అయితే కాంగ్రెస్ గెల‌వ‌డ‌మో, లేదంటే పొత్తులో భాగంగా సీటు బీజేపీకి ఇవ్వ‌డ‌మో త‌ప్ప టీడీపీ గెలిచింది లేదు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ చేతిలో ఓడిపోయింది. ఇప్ప‌టికీ అక్క‌డ అభ్య‌ర్థి లేక ఇక్క‌డ వైసీపీతో విభేదించి రాజీనామా చేస్తాన‌ని మూడేళ్లుగా చెబుతున్న ర‌ఘురామ కృష్ణంరాజు వ‌స్తే టికెట్ ఇద్దామ‌న్న‌ట్లుగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం టీడీపీ క్యాడ‌ర్‌ను మాన‌సికంగా ఇబ్బంది పెడుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లోనూ చివ‌రి వ‌ర‌కూ వెతుకులాటే

న‌ర‌సాపురంలో కొత్తప‌ల్లి సుబ్బారాయుడును అభ్య‌ర్థిగా నిలబెట్ట‌డం, లేదంటే పొత్తులో బీజేపీకి ఇవ్వ‌డం ఇలాగే గ‌త మూడు ద‌శాబ్దాలుగా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. సుబ్బారాయుడు పార్టీ మారిపోవ‌డంతో అప్ప‌టి నుంచి అక్క‌డ స‌రైన అభ్య‌ర్థే లేరు. గ‌త ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం లోక్ స‌భ స్థానానికి చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అభ్య‌ర్థి దొర‌క్క బాబు నానాతంటాలు ప‌డ్డారు. ఆర్థికంగా బ‌లంగా ఉండి వైసీపీ అభ్య‌ర్థిగా నిలిచిన ర‌ఘురామ కృష్ణంరాజును ఎదుర్కోవ‌డానికి ఎవ‌రికి టికెట్ ఇవ్వాలో అర్థం కాక అప్ప‌టి ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివ‌రామ‌రాజును బ‌రిలో దింపినా ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది.

ఐదేళ్ల‌లో అభ్య‌ర్థిని వెతుక్కోలేక‌పోయాం

న‌ర‌సాపురం లోక్‌స‌భ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ప‌ట్టుంది. వాటిలో ఎక్క‌డో ఓ చోట నుంచి అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌డానికి ఈ ఐదేళ్లుగా అన్వేషించాల్సిందిపోయి వైసీపీ నుంచి బ‌హిష్క‌రించ‌బ‌డిన ర‌ఘురామ కోసం వెంప‌ర్లాడ‌మేంట‌ని టీడీపీ క్యాడ‌ర్ ఆవేద‌న ప‌డుతోంది. నాలుగేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గం ముఖ‌మే చూడ‌ని ర‌ఘురామ ఎట్ట‌కేల‌కు మొన్న సంక్రాంతికి వ‌స్తే ఆయ‌న కోసం ఇక్క‌డ టీడీపీ, జ‌న‌సేన అసెంబ్లీ టికెట్ ఆశావ‌హులంద‌రూ ప‌డిగాపులు ప‌డ‌టం.. చంద్ర‌బాబు ఆయ‌న‌కే టికెట్ ఇచ్చేలా క‌న‌పడుతోందని.. పిచ్చిపిచ్చి ప్ర‌క‌ట‌న‌లు, అర్థం లేని వ్యాఖ్య‌ల‌తో ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌నైపోయిన ర‌ఘురామ‌రాజుకు టికెట్ ఇస్తే మ‌ళ్లీ ఈ సీటు పోయిన‌ట్లేన‌ని టీడీపీ క్యాడ‌ర్ స‌ణుగుతోంది.

First Published:  23 Jan 2024 5:08 PM IST
Next Story