Telugu Global
Andhra Pradesh

చేసుకున్నవారికి చేసుకున్నంత.. దీన్నీ జగన్‌కే అంటగడతావా రఘురామా..?

ప్రజలతో కలిసి సమస్యలపై పోరాటం చేస్తానని మరో అరిగిపోయిన రికార్డు పెట్టారు. ఆయన ప్రజలతో ఉన్నదెప్పుడు? ప్రజా సమస్యలను పట్టించుకున్నదెప్పుడు? నర్సాపురం నుంచి విజయం సాధించిన తర్వాత ఆయన ఢిల్లీలో మకాం వేసి, ప్రజల ముఖాలు చూసిన సందర్భాలున్నాయా? ఉన్నా నామమాత్రమే.

చేసుకున్నవారికి చేసుకున్నంత.. దీన్నీ జగన్‌కే అంటగడతావా రఘురామా..?
X

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై తన అక్కసు వెళ్ల‌గ‌క్కారు. తనకు బీజేపీ టికెట్‌ ఇవ్వకపోవడం కూడా జగన్‌ చేసిన కుట్రనే అంటూ విరుచుకుపడ్డారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నాయకుడు సోము వీర్రాజును కూడా లాగారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై విజయం సాధించి ఆ పదవికి రాజీనామా చేయకుండా జగన్‌పై కక్షపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ సాధించడానికి ఆయన పడరాని పాట్లుపడ్డారు. అయితే, ర‌ఘురామ‌ గుణం తెలిసిన బీజేపీ నాయకత్వం ఆయనను దగ్గరకు రానీయలేదు. ఆయనను కలవడానికి కూడా బీజేపీ అగ్రనేతలు ఇష్టపడలేదు. అప్పుడైనా ఆయనకు అర్థం కావాలి. అంత అర్థం చేసుకునే ఇంగితం ఆయనకు ఎక్కడ ఉంది?

ఓడ దాటాక తెప్ప తగిలేసే రకం రఘురామ కృష్ణం రాజు అనే విషయం బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలిసిపోయింది. దాంతోనే ఆయనకు టికెట్‌ నిరాకరించింది. సోము వీర్రాజు చెప్తే ఆయనకు బీజేపీ అగ్ర నాయకులు టికెట్‌ నిరాకరించారంటే అది నమ్మే విషయం కాదు. తన నీడను చూసి తానే భయపడే రఘురామ కృష్ణం రాజు జగన్‌నే టార్గెట్‌ చేశారు. జగన్‌ను తిట్టడానికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అరిగిపోయిన డైలాగ్‌ను అరువు తెచ్చుకున్నారు. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కేస్తానని ప్రగల్భాలు పలికారు.

ప్రజలతో కలిసి సమస్యలపై పోరాటం చేస్తానని మరో అరిగిపోయిన రికార్డు పెట్టారు. ఆయన ప్రజలతో ఉన్నదెప్పుడు? ప్రజా సమస్యలను పట్టించుకున్నదెప్పుడు? నర్సాపురం నుంచి విజయం సాధించిన తర్వాత ఆయన ఢిల్లీలో మకాం వేసి, ప్రజల ముఖాలు చూసిన సందర్భాలున్నాయా? ఉన్నా నామమాత్రమే.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై ఆయన అడ్డమైన ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై తన పోరాటానికి ఉబ్బి తబ్బిబై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు టికెట్‌ ఇస్తారని లేదా ఇప్పిస్తారని ఆయన కలలుగన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా ఆయన రఘురామకృష్ణంరాజును ఓ పావుగా వాడుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వద్దకు తనను చంద్రబాబు తీసుకుని వెళ్తారని భావించారు. ఆయనను గడప వద్దే ఆపేసి చంద్రబాబు లోనికి వెళ్లిపోయారు. చంద్రబాబు, పవన్‌ అమిత్‌ షాను కలిసి తిరిగి బయటకు వచ్చే వరకు ఆయన అక్కడే పడిగాపులు కాశారు. ఇది చాలదా ఆయనకు టికెట్‌ రాదని చెప్పడానికి.

జగన్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎల్లో మీడియా కూడా విపరీతమైన ప్రచారం కలిగిస్తూ వచ్చింది. చంద్రబాబు అవసరానికి వాడుకుని వదిలేస్తారనే విషయం రఘురామ రాజుకు తెలియంది కాదు. రఘురామను చూస్తుంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని అనుకోవాల్సిందే.

First Published:  25 March 2024 9:28 AM IST
Next Story