రఘురామ కృష్ణంరాజుకు చేదు అనుభవం
లోనికి వెళ్లడానికి ప్రయత్నించినా రఘరామ కృష్ణంరాజును సిబ్బంది అడ్డుకున్నారు. తనను లోనికి అనుమతించాలని ఆయన కాల్స్ మీద కాల్స్ చేశారు.
పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజుకు హస్తినలో చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శనివారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వారిద్దరితో పాటు రఘురామ కృష్ణంరాజు అమిత్ షా వద్దకు వెళ్లాలని అనుకున్నారు. అయితే, వారు ఆయనను తమ వెంట తీసుకుని వెళ్లలేదు.
లోనికి వెళ్లడానికి ప్రయత్నించినా రఘరామ కృష్ణంరాజును సిబ్బంది అడ్డుకున్నారు. తనను లోనికి అనుమతించాలని ఆయన కాల్స్ మీద కాల్స్ చేశారు. అయినా ఆయనకు అనుమతి లభించలేదు. దీంతో ఆయన పవన్ కల్యాణ్, చంద్రబాబు వచ్చేంత వరకు గేటు బయటనే నిలబడాల్సి వచ్చింది.
తాను నర్సాపురం నుంచి పోటీ చేస్తానని ఇంతకు ముందు ఆయన చెప్పారు. కానీ ఏ పార్టీ నుంచి అనేది చెప్పలేదు. టీడీపీ, జనసేనలతో బీజేపీకి పొత్తు కుదిరిన నేపథ్యంలో బీజేపీ తరఫున పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, బీజేపీ అగ్రనాయకత్వం ఆయన అభ్యర్థిత్వానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.