Telugu Global
Andhra Pradesh

ఇవాళ టీడీపీలోకి రఘురామ.. ఆ స్థానం నుంచే పోటీ..?

బీజేపీ నుంచి తనకు టికెట్ దక్కకపోవడానికి సీఎం జగనే కారణం అంటూ నిందలు వేసిన రఘురామకృష్ణరాజు.. ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకుని అసెంబ్లీ బరిలో ఉంటారని తెలుస్తోంది.

ఇవాళ టీడీపీలోకి రఘురామ.. ఆ స్థానం నుంచే పోటీ..?
X

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు.. అనంతరం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పరోక్షంగా టీడీపీకి సహకరించే ప్రయత్నాలు చేశారు. వైసీపీ, సీఎం జగన్‌పై బురద జల్లుతూ కాలం వెల్లబుచ్చారు.

ఐదేళ్ల పాటు ఎంపీగా కొనసాగిన రఘురామకృష్ణరాజు.. ఏ పార్టీలోనూ చేరలేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం, బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో.. ఏ పార్టీలో చేరకుండానే కూటమి నుంచి టికెట్ ఆశించారు. అన్ని పార్టీలు తనను ఆదరిస్తాయనుకున్నాడు. ఇక పొత్తులో భాగంగా నరసాపురం బీజేపీకి వెళ్లడంతో.. తనకే టికెట్ ఇస్తుందని భావించారు రఘురామ. కానీ, రఘురామకృష్ణరాజును కూరలో కరివేపాకుల పక్కనపెట్టేసింది బీజేపీ. పార్టీకి విధేయుడిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మను అభ్యర్థిగా ప్రకటించింది.

ఇక బీజేపీ నుంచి తనకు టికెట్ దక్కకపోవడానికి సీఎం జగనే కారణం అంటూ నిందలు వేసిన రఘురామకృష్ణరాజు.. ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకుని అసెంబ్లీ బరిలో ఉంటారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సేఫ్ ప్లేసుగా ఉన్న ఉండి స్థానం ఇస్తానని చంద్రబాబు రఘురామకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం. ఆయనను తప్పించి రఘురామకు టికెట్ ఇచ్చేలా డీల్ కుదిరిందని తెలుస్తోంది. ఇక కూటమి అధికారంలోకి వస్తే తనకు ఏ పదవి దక్కుతుందో కూడా చెప్పేశారు రఘురామ. తనను స్పీకరుగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

First Published:  5 April 2024 1:11 PM IST
Next Story