Telugu Global
Andhra Pradesh

పురంధేశ్వరికి కనీస సంస్కారం లేదా?

ఒక మహిళ అని కూడా చూడకుండా శ్రీకాకుళం ఎస్పీ రాధిక గురించి తన ఫిర్యాదు లేఖలో చెత్త రాతలు రాశారు పురంధేశ్వరి. ఎస్పీ రాధిక సామాజిక వర్గం, ఆమె భర్త సామాజిక వర్గాన్ని ప్రస్తావించడం.. పురంధేశ్వరి దిగజారుడు తనానికి పరాకాష్ట అని తేలిపోయింది.

పురంధేశ్వరికి కనీస సంస్కారం లేదా?
X

కేంద్ర మాజీ మంత్రి అనే ట్యాగ్ లైన్ ఉండటం వల్ల పురంధేశ్వరికి ఏపీ రాజకీయాల్లో కాస్తో కూస్తో ఐడెంటిటీ ఉంది కానీ, అది మినహా ఆమె ఏపీకి చేసిందేమీ లేదు, ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు, కనీసం తాను ఉన్న పార్టీకి కూడా ఆమె ఏమాత్రం ఉపయోగపడలేదు. అలాంటి పురంధేశ్వరి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన ఓ లేఖ సంచలనంగా మారింది. ఫలానా అధికారి మాకు నచ్చడంలేదు, మార్చేయండి అంటూ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక చాలామంది హడావిడి చేస్తుంటారు. పురంధేశ్వరి కూడా అలానే ఈసీకి కంప్లయింట్ చేస్తూ ఓ లేఖ రాశారు. కానీ ఇది ఆమె అహంకారానికి పరాకాష్ట అని చెప్పుకోవాల్సిన సందర్భం. టీడీపీకి ఆమె చేస్తున్న చెంచాగిరికి నిదర్శనం. ఓ సామాజిక వర్గంపై ఆమె కడుపులో ఇన్నాళ్లూ దాచుకున్న విషం. ఏపీలో 22 మంది ఐపీఎస్ అధికారులపై ఆమె వేసిన నిందలు దారుణంగా ఉన్నాయి. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు.. వారి పనితీరుని ప్రభావితం చేసేలా ఆమె బురదజల్లాలనుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నాననే ధైర్యంతోనే ఆమె అడ్డగోలుగా ఈ ఆరోపణలు చేశారు. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.

ఆయన రెడ్డి.. అందుకే

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు పురంధేశ్వరి. ఈసీకి రాసిన ఫిర్యాదు లేఖలో ఆయన కులాన్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. రెడ్డి సామాజి వర్గానికి చెందిన పోలీస్ అధికారులకు ఆయన కీలక పోస్టింగ్ లు ఇప్పించారని, అసలాయన ఇన్ చార్జ్ డీజీపీ మాత్రమేనని చెప్పారు. సీక్రెట్ రిజర్వ్ ఫండ్ నుంచి ఏడున్నర కోట్లు ఆయన కాజేశారని, దానికి సంబంధించిన ఫైల్స్ ధ్వంసం చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నిజమైతే ఇన్నాళ్లూ ఆమె ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇవి తప్పుడు ఆరోపణలు అని రుజువైతే మాత్రం పురంధేశ్వరి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు సహా మరికొందరు కీలక నేతల పేర్లను తన ఫిర్యాదు లేఖలో ప్రస్తావించారు పురంధేశ్వరి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. అసలు ఎన్నికల విధులతో పెద్దగా సంబంధం లేని డిజాస్టర్ మేనేజ్ మెంట్ డీజీ సునీల్ కుమార్ ని కూడా మార్చేయాలంటూ ఆమె లేఖ రాశారు. ఆయన్ను ఏకంగా పక్క రాష్ట్రానికి పంపించేయాలంటూ తన కడుపుమంటను లేఖలో బయటపెట్టారు పురంధేశ్వరి.

ఇంత అహంకారం ఎందుకు..?

ఫలానా అధికారిని పక్కనపెట్టండి అని చెప్పడం వరకు ఓకే, కానీ ఆయన స్థానంలో ఫలానా వారిని కూర్చోబెట్టండి అంటూ నేరుగా ఈసీకే సూచించారంటే పురంధేశ్వరి ఎంత ఎక్కువగా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ కావాలనుకున్నారో స్పష్టమవుతుంది. ఏకంగా ప్రభుత్వ నియామకాలనే ప్రశ్నించారామె. అందులోనూ ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో ఎవరూ ఇప్పటికిప్పుడు ఎన్నికలకోసం ఆయా పోస్టింగ్ లు తెచ్చుకున్నవారు కాదు. ఏళ్లతరబడి ఆయా విభాగాల్లో సమర్థంగా సేవలందిస్తున్నవారిపై కూడా బురదజల్లారు పురంధేశ్వరి.

ఇంత నీఛానికి దిగజారాలా..?

ఒక మహిళ అని కూడా చూడకుండా శ్రీకాకుళం ఎస్పీ రాధిక గురించి తన ఫిర్యాదు లేఖలో చెత్త రాతలు రాశారు పురంధేశ్వరి. శ్రీకాకుళం ఎస్పీ రాధిక బ్రాహ్మిణ్ అని ఆమె రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లాడిందని, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఓడించడానికే ఆమెకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారన్నారు. ఫిర్యాదులో ఆమె కులం, ఆమె భర్త కులం ప్రస్తావించడం పురంధేశ్వరి దిగజారుడు తనానికి పరాకాష్ట అని తేలిపోయింది.

ఎవరికోసం..?

జెండాలు జతకట్టడమే తమ అజెండా అని నిరూపించుకున్న పురంధేశ్వరి, టీడీపీతో పొత్తుకోసం ఎంత తహతహలాడిపోయారో అందరికీ తెలుసు. కేవలం 10 అసెంబ్లీ స్థానాలకే బీజేపీని పరిమితం చేసి, ఏపీలో ఉనికి లేకుండా చేశారు. తాను గెలవాలి, తాను మాత్రమే ఎంపీగా గెలవాలి, ఏపీ కోటాలో కేంద్రంలో మంత్రి పదవి తెచ్చుకోవాలనేదే ఆమె అజెండా. అందుకు టీడీపీ సపోర్ట్ తప్పనిసరి. అందుకే ఆమె కూటమి కట్టారు, టీడీపీకి మేలుచేయడం కోసం అధికారులపై కక్షగట్టారు.

ఈ లేఖను పురంధేశ్వరి మార్చి 26న ఈసీకి పంపించారు. ఆ లిస్ట్ లో ఉన్న కొందర్ని ఎన్నికల కమిషన్ ఇటీవల బదిలీ చేసింది. అంటే ఆమె ప్రయత్నం కొంతమేర సఫలం అయినట్టు అనుకోవాలి. అయితే ఆ లేఖలో ఆమె చేసిన ఆరోపణలు మాత్రం మరింత సంచలనం అవుతున్నాయి. ఆ ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే చట్టప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినపడుతున్నాయి.

First Published:  5 April 2024 1:04 PM IST
Next Story