పురందేశ్వరి... గురివింద గింజేనా?
ఏపీ అప్పులపై శ్వేతపత్రాన్ని ప్రకటించాలని జగన్‌ను డిమాండ్ చేస్తున్న పురందేశ్వరి మరి కేంద్రం చేసిన అప్పులపై ఎందుకు మాట్లాడటంలేదు? కోటి కోట్ల రూపాయల అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని దేనికెంత ఖర్చుపెట్టిందో చెప్పగలరా?
తెలుగులో ఒక సామెతుంది. అదేమిటంటే అందరి నలుపు గురించి మాట్లాడే గురివింద గింజ తన నలుపు ఎరుగదని. ఈ సామెత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి సరిగ్గా సరిపోతుంది. విషయం ఏమిటంటే అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకున్న రోజు నుండి ఏపీ అప్పులపై ఆమె పదేపదే విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ళ పాలనలో జగన్ ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసిందంటు పదేపదే ఆరోపిస్తున్నారు. ఏపీ మొత్తం అప్పు రూ. 10 లక్షల కోట్లయితే ఇందులో జగన్ చేసిందే రూ. 7 లక్షల కోట్లు అంటున్నారు.
ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనతో తాను విభేదిస్తున్నట్లు చెప్పారు. తన ఆరోపణలకే తాను కట్టుబడున్నట్లు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. సరే ఏపీ అప్పుల విషయాన్ని పక్కనపెట్టేద్దాం. నరేంద్ర మోడీ హయాంలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అప్పుల గురించి పురందేశ్వరికి ఏమైనా సమాచారం ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కేంద్రం అప్పులు సుమారు 157 లక్షల కోట్ల రూపాయలు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి 2014 వరకు వివిధ ప్రభుత్వాలు చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లు.
2014లో ఎన్డీయే అధికారంలోకి రాగానే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. అప్పటి నుండి 2023 మార్చికి కేంద్ర ప్రభుత్వం అప్పులు రూ.157 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే కేవలం పదేళ్ళల్లో మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం సుమారు కోటి కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే 67 సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వాలు 56 లక్షల కోట్లు అప్పుచేస్తే పదేళ్ళల్లోనే మోడీ ప్రభుత్వం ఒక్కటే రూ.కోటి కోట్లు అప్పుచేసింది.
ఏపీ అప్పులపై శ్వేతపత్రాన్నివిడుదల చేయాలని జగన్‌ను డిమాండ్ చేస్తున్న పురందేశ్వరి మరి కేంద్రం చేసిన అప్పులపై ఎందుకు మాట్లాడటంలేదు? కోటి కోట్ల రూపాయల అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని దేనికెంత ఖర్చుపెట్టిందో జనాలకు పురందేశ్వరి వివరించి చెప్పగలరా? పరిమితికి మించి కేంద్రప్రభుత్వం చేస్తున్న అప్పులను ఎవరు నియంత్రించాలి? ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తు, మరోవైపు విచ్చలవిడిగా చేస్తున్న అప్పులకు పురందేశ్వరి సమాధానం చెప్పగలరా?