పురందేశ్వరి తెగ ఫీలైపోయారా?
ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే తనపై టీడీపీ కోవర్టని ముద్ర వేయటం ఏమిటని వాపోయారు. ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షాలు విమర్శించకూడదా? ఎత్తి చూపకూడదా అని అమాయకంగా అడిగారు.
బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెగ ఫీలైపోయినట్లున్నారు. అనంతపురం పార్టీ మీటింగులో మాట్లాడుతూ.. తనను వైసీపీ వాళ్ళు టీడీపీ కోవర్టని ముద్రవేశారని బాధపడిపోయారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే తనపై టీడీపీ కోవర్టని ముద్ర వేయటం ఏమిటని వాపోయారు. ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షాలు విమర్శించకూడదా? ఎత్తి చూపకూడదా అని అమాయకంగా అడిగారు. అయితే పురందేశ్వరిపైన మంత్రులు, విజయసాయిరెడ్డి ఊరికే టీడీపీ కోవర్టని ముద్ర వేయలేదు.
వైసీపీ వాళ్ళు ఆమెపై కోవర్టనే ముద్ర వేయటానికి బలమైన కారణం ఉంది. ఆ కారణం ఆమెకు కూడా బాగా తెలుసు. అయినా తెలియనట్లే నటిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన దగ్గర నుండి పదేపదే జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉన్నారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంటే, తప్పులు జరుగుతుంటే ఆరోపించటం, ఎత్తిచూపటాన్ని ఎవరు తప్పుపట్టరు.
కానీ పురందేశ్వరి ఆరోపణలన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయి. టిడ్కో ఇళ్ళు కట్టలేదని, లిక్కర్ స్కామ్ జరిగింది. ఇసుక కుంభకోణం జరిగిందని పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇవన్నీ తన మరిది చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి కదా. మరప్పట్లో పురందేశ్వరి ఎందుకు నోరిప్పలేదు? ఇప్పుడే ఎందుకు గోల చేస్తున్నట్లు? ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై ఏ అంశాల్లో అయితే అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారో చంద్రబాబు హయాంలో ఇంతకన్నా ఎక్కువ అవినీతే జరిగింది. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలకు బీజేపీ ప్రత్యర్థి పార్టీయే అన్న విషయం బహుశా పురందేశ్వరి మరచిపోయారేమో.
టీడీపీకి బాస్ తన మరిది కాబట్టే పురందేశ్వరి పదేపదే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని మంత్రులు, విజయసాయి అంటున్నారు. అందుకనే ఆమె మీద టీడీపీ కోవర్టని ముద్రవేసింది. ఆమె జగన్‌తో పాటు చంద్రబాబు పాలన మీద కూడా ఆరోపణలు చేస్తుంటే కోవర్టని, చంద్రబాబు ప్రయోజనాలను రక్షిస్తోందనే గోల ఉండేది కాదు. మంత్రులు, విజయసాయి రెడ్డి అన్నారంటే అర్థముంది మరి సొంత పార్టీ సీనియర్ నేత డాక్టర్ సుబ్బారెడ్డి కూడా ఇదే మాట బాహాటంగానే అన్నారు కదా? మరి ఆయనెందుకు చంద్రబాబు ప్రయోజనాల రక్షణ కోసమే పాకులాడుతున్నారని ఆరోపించారో పురందేశ్వరి సమాధానం చెప్పగలరా?