సొంత ప్రభుత్వంపైనే నమ్మకం లేదా?
తానే స్వయంగా కలిసి ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లని ఫిర్యాదు చేసిన తర్వాత కూడా నిర్మల సీతారామన్ రూ.4.42 లక్షల కోట్లుగానే చెప్పటాన్ని పురందేశ్వరి తట్టుకోలేకపోతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాటలోనే పురందేశ్వరి కూడా నడుస్తున్నట్లున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే పవన్‌కు వ్యక్తిగతంగా బాగా కసిపేరుకుపోయిన విషయం తెలిసిందే. అందుకనే జగన్‌కు వ్యతిరేకంగా పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. పవన్ చేసే ఆరోపణలకు, విమర్శలకు అసలు లాజిక్ ఉండదు. జగన్‌పై బురదచల్లాలంతే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా పవన్‌ను ఫాలో అవుతున్నట్లున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే మీడియాతో పురందేశ్వరి మాట్లాడుతూ.. ఏపీ అప్పులపై మళ్ళీ విరుచుకుపడ్డారు. అన్నీరకాల అప్పులూ కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల వరకు అప్పు చేసిందన్నారు. ఆ ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఏపీ అప్పులు రూ. 4.42 లక్షల కోట్లు కాదన్నారు. పురందేశ్వరి వ్యవహారం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నమ్మటంలేదన్న విషయం తెలిసిపోతోంది.
జగన్ ప్రభుత్వం అప్పులకు, తప్పులకు మల్లగుల్లాలు పడుతోందన్నారు. మరీ ఆ మాటకు అర్థం ఏమిటో తెలీటం లేదు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ చెప్పింది ఎఫ్ఆర్బీఎం పరిధిలో చేసిన అప్పులు మాత్రమేనట. ప్రభుత్వ ఆస్తులు తనఖాపెట్టి, మద్యం ఆదాయం చూపి చేసిన అప్పులు చాలా ఉన్నాయంటున్నారు. అలాంటి అప్పులన్నీ కలిపి రూ.10 లక్షల కోట్ల అప్పుందన్న ఆరోపణలకే తాను కట్టుబడి ఉన్నట్లు బల్లగుద్ది చెప్పారు.
ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఏపీ అప్పులు రూ. 4.42 లక్షల కోట్లే అని రాజ్యసభలో ఆర్థికశాఖ సహాయమంత్రి చేసిన ప్రకటనపై పురందేశ్వరి మండిపోయారు. అందుకనే నిర్మల సీతారామన్‌ను కలిసి ఏపీ అప్పులు రూ. 10 లక్షల కోట్లని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత లోక్‌సభలో అప్పులపై నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. ఏపీ అప్పులు రూ. 4.42 లక్షల కోట్లుగా ప్రకటించారు. తానే స్వయంగా కలిసి ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లని ఫిర్యాదు చేసిన తర్వాత కూడా నిర్మల సీతారామన్ రూ.4.42 లక్షల కోట్లుగానే చెప్పటాన్ని పురందేశ్వరి తట్టుకోలేకపోతున్నారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో విభేదిస్తున్నట్లు ప్రకటించారు.