Telugu Global
Andhra Pradesh

అప్పులు, తప్పులు, తిప్పలు.. మళ్లీ పురందరేశ్వరి విమర్శలు

జగన్ ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు మల్ల గుల్లాలు పడుతోందన్నారు పురందరేశ్వరి. గతంలో తాను చెప్పినట్టు ఏపీ అప్పు 10లక్షల కోట్లలో జగన్ వాటా ఏడు లక్షల కోట్లు అని, అందులో అనుమానమేం లేదన్నారు.

అప్పులు, తప్పులు, తిప్పలు.. మళ్లీ పురందరేశ్వరి విమర్శలు
X

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి పురందరేశ్వరి.. సీఎం జగన్ ని, వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గత అధ్యక్షుడు సోము వీర్రాజులా కాకుండా కాస్త గట్టిగానే విమర్శల బాణాలు వదులుతున్నారు. ఏపీ అప్పుల గురించి ఆమె చేసిన విమర్శలు, ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన లెక్కలకు తేడాలుండే సరికి వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. కేంద్రం తమకు సర్టిఫికెట్ ఇస్తుంటే, చంద్రబాబు దూతలాగా పురందరేశ్వరి టీడీపీకి వంతపాడుతున్నారంటూ మండిపడ్డారు. అయితే ఈరోజు మళ్లీ పురందరేశ్వరి, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తాను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు, మరిన్ని ఉదాహరణలు చెప్పారు.

జగన్ ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు మల్ల గుల్లాలు పడుతోందన్నారు పురందరేశ్వరి. గతంలో తాను చెప్పినట్టు ఏపీ అప్పు 10లక్షల కోట్లలో జగన్ వాటా ఏడు లక్షల కోట్లు అని, అందులో అనుమానమేం లేదన్నారు. కేంద్ర మంత్రి నిర్మలమ్మ చెప్పిన లెక్కల్లో ఉన్న 1.77 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఎఫ్ఆర్ఎంబీ పరిధిలోనివి అని చెప్పారు. ఇందులో ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి, మద్యం ఆదాయం ష్యూరిటీగా చూపి ఏపీప్రభుత్వం చేసిన అప్పులు లేవన్నారు. అవన్నీ కలిపితే ఏపీ అప్పు 10లక్షల కోట్లు అని వివరించారు.

కొవిడ్ వల్ల నలభై వేల కోట్లు అప్పు తెచ్చుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని, అదే సమయంలో ఇతర వనరులు ద్వారా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు పురందరేశ్వరి. తనపై వైసీపీ చేస్తున్న విమర్శల్లో పసలేదన్నారు. అప్పుల లెక్కలు అడిగితే.. సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

First Published:  1 Aug 2023 9:10 PM IST
Next Story