Telugu Global
Andhra Pradesh

సవాళ్లు, పరామర్శలు, ఫిర్యాదులు.. నేడు చిత్తూరు జిల్లా బంద్

ఘర్షణల నేపథ్యంలో నేడు వైసీపీ.. చిత్తూరు జిల్లా బంద్ కి పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సవాళ్లు, పరామర్శలు, ఫిర్యాదులు.. నేడు చిత్తూరు జిల్లా బంద్
X

పుంగనూరు ఘర్షణల్లో ఇరు వర్గాల తలలు పగిలాయి. మధ్యలో పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పుంగనూరు మెయిన్ రోడ్డు రక్తమోడింది. పెద్దిరెడ్డి ఇలాకాలో బలం చూపాలని టీడీపీ, తమ ప్రాంతంలో చంద్రబాబుని అడ్డుకోవాలని వైసీపీ.. ఇలా రెండు పార్టీలు పంతాలకు పోవడంతో చివరకు పుంగనూరు రణరంగంగా మారింది.

సవాళ్లు..

పుంగనూరు మీ తాత జాగీరా..?

నువ్వేమైనా పెద్ద పుడింగివా..?

నన్ను బెదిరించడం మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు.

కర్రలతో వస్తే కర్రలతో వస్తా. రౌడీలకు రౌడీగా ఉంటా.

ఏయ్‌ పోలీస్‌.. వాళ్లను పంపించండి

అంటూ చంద్రబాబు పుంగనూరులో సవాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నుంచి ఆ స్థాయిలో బదులివ్వలేదు నాయకులు. చంద్రబాబు వ్యాఖ్యలు మాత్రం హైలెట్ అయ్యాయి. సీనియర్ నాయకుడు అయిఉండి కూడా చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మాత్రమై వైసీపీ ఆరోపణలు చేసింది.

పరామర్శలు..

పుంగనూరు ఘర్షణల్లో టీడీపీ, వైసీపీ శ్రేణులగు గాయాలయ్యాయి. మధ్యలో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి, 50 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 2 పోలీస్ వాహనాలు దగ్ధమయ్యాయి. చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను ఎస్పీ రిషాంత్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి ఈరోజు పరామర్శించారు. పోలీసులు త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఫిర్యాదులు..

మరోవైపు ఈ ఘటనపై ఇరు వర్గాలు ఫిర్యాదులకు సిద్ధమయ్యాయి. పుంగనూరు ఘర్షణలపై విచారణ జరిపిస్తామంటోంది ప్రభుత్వం. అటు ప్రతిపక్ష టీడీపీ గవర్నర్ కి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఈరోజు టీడీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలవబోతున్నారు. ఘర్షణలకు సంబంధించిన వీడియోలను ఆయనకు చూపిస్తామంటున్నారు. వైసీపీ నేతలు దాడి చేశారని, టీడీపీ నేతలు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.

చిత్తూరు బంద్..

ఘర్షణల నేపథ్యంలో నేడు వైసీపీ.. చిత్తూరు జిల్లా బంద్ కి పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పుంగనూరులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

First Published:  5 Aug 2023 10:05 AM IST
Next Story