పులివెందులలో పగిలిన అద్దం.. అందులోని అంతరార్థం
అద్దం పగలడాన్ని కూడా భూతద్దంలో చూస్తారెందుకని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. డీస్పీ వివరణ చూడండి అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ తొలిసారి సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లారు. మూడు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. తొలిరోజు జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆ ప్రజా దర్బార్ కి వచ్చినవారిలో కొందరు ఆందోళనకు దిగారని, జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, జగన్ ఉన్న హాల్ లో కిటికీ అద్దాలను వారు రాళ్లతో పగలగొట్టారని వార్తలు బయటకొచ్చాయి. ఎల్లో మీడియా దీనిపై పెద్ద రాద్ధాంతం చేసింది. సొంత నియోజకవర్గంలోనే జగన్ పై వ్యతరేకత వచ్చిందని, సొంత పార్టీ కార్యకర్తలే ఆయన ముందు గొడవకు దిగారని కథనాలిచ్చింది. దీంతో జగన్ పులివెందుల పర్యటన టాక్ ఆఫ్ ఏపీగా మారింది.
అసలేం జరిగింది..?
పులివెందుల పర్యటనపై వైరి వర్గం విషం చిమ్ముతోందని అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారని తెలియడంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారని, ఒక్కసారిగా అందరూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో కార్యకర్తల తోపులాటలో అద్దాలు పగిలాయని అంటున్నారు. అంతేకానీ రాళ్లదాడి జరగలేదని చెప్పారు. పార్టీ వ్యతిరేక నినాదాలు ఎవరూ చేయలేదంటున్నారు. పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ మాటల్ని జతచేసి అసలు విషయం ఇదీ అంటున్నారు వైసీపీ నేతలు.
పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) June 22, 2024
ఒక్క సారిగా అందరూ లోపలికి వెళ్లే ప్రయత్నంతో కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయి పులివెందులలో ఎటువంటి రాళ్లదాడి జరగలేదు
పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదు
కేవలం వైయస్… pic.twitter.com/fjYq9DrpVg
సీఎంగా ఉన్నప్పుడు జగన్ కి ఎలాంటి ఆదరణ ఉందో, అధికారం కోల్పోయినా కూడా ఆయనపట్ల జనం అవే ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని వైసీపీ నేతలంటున్నారు. కాదు, కాదు, జగన్ ని సొంత నియోజకవర్గ ప్రజలే నిలదీశారని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. అద్దం పగలడాన్ని కూడా భూతద్దంలో చూస్తారెందుకని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ గొడవ సంగతి పక్కనపెడితే.. ఈ పర్యటనలో జగన్ ప్రెస్ మీట్ పెడతారా, లేక కేవలం నేతలు, కార్యకర్తలతో సమావేశాలు మాత్రమే నిర్వహిస్తారా అనేది వేచి చూడాలి.