ఫేక్ యాత్రికులూ.. గో బ్యాక్..! - అమరావతి రైతుల పాదయాత్రకు తణుకులో నిరసన సెగ
అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న హంగామా వెనుక.. వారి రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని జనం మండిపడ్డారు.
అమరావతి టు అరసవెల్లి అంటూ అమరావతి రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం తణుకు చేరిన పాదయాత్రకు స్థానికుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. గోబ్యాక్.. ఫేక్ యాత్రికులూ.. అంటూ ప్లకార్డులు, బ్యానర్లు, నల్ల బెలూన్లు ప్రదర్శిస్తూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. మూడు రాజధానులే ముద్దని, ఏకైక రాజధాని వద్దే వద్దంటూ వారు నినాదాలు చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు, టీడీపీ అండ్ కో కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు.
పాదయాత్రలో ఉన్నవారంతా రైతులు కాదు..
పాదయాత్రలో ఉన్నవారంతా రైతులని తాము నమ్మడం లేదని స్థానిక ప్రజలు స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పెట్టిన డూప్లికేట్‌లే పాదయాత్ర పేరుతో వస్తున్నారని, ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలంటే.. మూడు రాజధానులు ఉండాల్సిందేనని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు సమానంగా అందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారని, దానికి తాము పూర్తిగా మద్దతిస్తున్నామని ఈ సందర్భంగా వారు తేల్చి చెప్పారు.
రైతుల ముసుగులో తెలుగుదేశం చేస్తున్న యాత్ర..
రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న యాత్ర ఇదని స్థానిక ప్రజలు స్పష్టం చేశారు. ఇప్పటికే మద్రాసు, హైదరాబాద్ రాజధానులను కోల్పోయి తీవ్రంగా నష్టపోయామని, ఇక్కడి నిధులన్నీ ఒకే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆ ఒక్క చోటే అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు కూడా మేలుకోకపోతే తర్వాతి తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని స్థానిక ప్రజలు స్పష్టం చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే.. అమరావతి రాజధాని..
అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న హంగామా వెనుక.. వారి రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని జనం మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు అమరావతి రాజధాని ప్రాంతంలో వందల ఎకరాల భూములు కొనేశారని, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందనే రాజధాని పేరుతో రాష్ట్రమంతటా అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తిగా ఉనికి కోల్పోతున్న టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకే ఆ పార్టీ నేతలు పాదయాత్ర చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు.