చింతమనేనిపై అసమ్మతి.. - నిరసన చేపట్టిన టీడీపీ, జనసేన
దెందులూరు నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన కేడర్‌లో కలకలం మొదలైంది. అంతే.. చింతమనేనికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టేశారు.
చింతమనేని ప్రభాకర్.. ఈయన గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేకుండానే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను గమనిస్తున్నవారందరితో పాటు అనేకమంది ప్రజానీకానికి కూడా ఠక్కున గుర్తుకొచ్చే వ్యక్తి. రౌడీ ఎమ్మెల్యేగా ముద్రపడటమే దీనికి ప్రధాన కారణం. టీడీపీ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కి మరోసారి సీటిచ్చే యోచనలో పార్టీ అధిష్టానం ఉందనే సమాచారంతో టీడీపీ, జనసేన నేతలు గురువారం రోడ్డెక్కారు. ఏలూరు నగరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ తరఫున దెందులూరు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఆయన చేసిన అరాచకాలు, అక్రమాలకు లెక్కే లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వనజాక్షి అనే మహిళా తహసీల్దార్‌ని ఈడ్చికొట్టి.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అధికారంలో ఉండగా అటవీ సిబ్బందిపై దాడి చేయడం, నోటి దురుసుకు అయితే అడ్డూ అదుపూ ఉండదు. ఏకంగా పవన్ కల్యాణ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ దారుణం. పవన్ కల్యాణ్ మద్దతుతోనే మీరు గెలిచారు కదా అని అడిగితే.. పవన్ ఒక సన్నాసి.. సొంత అన్ననే పాలకొల్లులో గెలిపించలేనోడు మా చంద్రబాబును గెలిపిస్తాడా? అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించాడు. ఇక ఎస్సీలపై చేసిన వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గం ఎప్పటికీ మరిచిపోలేదు.
ఆయనపై కోర్టుల్లో ఉన్న కేసులకైతే లెక్కే లేదు. దాదాపు అన్నీ అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించినవే. ప్రస్తుతం ఆయన దెందులూరు నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ మేరకు చంద్రబాబు నుంచి కూడా ఆయనకు సీటు కేటాయింపు విషయంలో అభ్యంతరం లేదని తెలుస్తోంది. ఈ విషయం అర్థమైందో ఏమో దెందులూరు నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన కేడర్‌లో కలకలం మొదలైంది. అంతే.. చింతమనేనికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టేశారు. ’ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా పర్లేదు’ అంటూ ఆయన వ్యతిరేకులు పెట్టిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. గురువారం ఏకంగా జిల్లా కేంద్రమైన ఏలూరులో నిరసన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దెందులూరుకు చెందిన టీడీపీ, జనసేన నాయకులు పాల్గొని చింతమనేనికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అప్రజాస్వామిక, అడ్డగోలు రాజకీయాలు చేస్తున్న చింతమనేనికి, ఆయన్ని ప్రోత్సహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.