ఉండి నుంచి భీమవరాన్ని తాకిన టీడీపీ అసమ్మతి సెగ
ఎమ్మెల్యే రామరాజు వర్గీయులు ఉండి నుంచి భీమవరం ర్యాలీ నిర్వహించి సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. టికెట్ రామరాజుకే ఉంచాలని, ఇక్కడ వేరేవారిని తీసుకొస్తే సహించేది లేదంటూ నినాదాలు చేశారు.
టీడీపీలో చేరిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇస్తారన్న ప్రచారం.. ఆ నియోజకవర్గంలో అసమ్మతి మంటలు రేపుతోంది. టికెట్ ప్రకటించడంతో 15 రోజుల నుంచి ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే రామరాజు వర్గం టికెట్ చేజారుతుందన్న ప్రచారంతో మండిపడుతోంది. గురువారం ఉదయం ఆ నిరసన సెగ భీమవరంలో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వరకు తాకింది.
రకరకాలుగా ఒత్తిడి
ఎమ్మెల్యే రామరాజు వర్గీయులు ఉండి నుంచి భీమవరం ర్యాలీ నిర్వహించి సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. టికెట్ రామరాజుకే ఉంచాలని, ఇక్కడ వేరేవారిని తీసుకొస్తే సహించేది లేదంటూ నినాదాలు చేశారు. రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలియడంతో రామరాజు రకరకాల మార్గాల్లో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
టీడీపీ ఓట్లు మూడు ముక్కలు
ఇప్పటికే రామరాజుకు టికెట్ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పార్టీకి దూరం జరిగారు. ఆయన వర్గం ఓట్లే పోతాయని టీడీపీ కంగారుపడుతోంది. ఇప్పుడు రఘురామకు టికెటిస్తే తాను ఇండిపెండెంట్‌గా అయినా బరిలోకి దిగుతానని ఎమ్మెల్యే రామరాజు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే టీడీపీ ఓట్లు మూడు ముక్కలవుతాయి. అప్పుడు ఇక్కడ వైసీపీ గెలుపు నల్లేరుపై నడకే అవుతుంది.