Telugu Global
Andhra Pradesh

ఇప్పుడు ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులే ఇస్తారు.. ఏపీ ప్రభుత్వంపై నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు

నిర్మాత అశ్వినీదత్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న సీజన్ వేరు కదా.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులే ఇస్తారని సెటైర్ వేశారు.

ఇప్పుడు ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులే ఇస్తారు.. ఏపీ ప్రభుత్వంపై నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వదని.. ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అవార్డులే ఇస్తుందని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను 4కేఈలో రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ నిర్మాతలు ఆది శేషగిరిరావు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇవ్వాలన్న ఆసక్తి అటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ప్రభుత్వం అందించే అవార్డుకు ఒక విలువ ఉండేదన్నారు. ఇప్పుడు తన ఉద్దేశంలో ఆ అవార్డుకు విలువ లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అనంతరం నిర్మాత అశ్వినీదత్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న సీజన్ వేరు కదా.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులే ఇస్తారని సెటైర్ వేశారు. సినిమాలకు నంది అవార్డులు ఇచ్చే రోజులు రెండు మూడేళ్లలో వస్తాయని, అప్పుడు మనందరికీ అవార్డులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. నంది అవార్డులు ఇవ్వకపోవడంపై నిర్మాతలు ఆది శేషగిరిరావు, అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

కాగా, గతంలో సినీ రంగంలో 24 కళారంగాల్లో ప్రతిభ చూపిన వారికి ఏటా ప్రభుత్వం నంది అవార్డులు అందజేసి సత్కరించేది. అవార్డులు ఇవ్వడం కొంత ఆలస్యమైనప్పటికీ ప్రతి సంవత్సరానికి సంబంధించిన అవార్డులు ఇచ్చేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక్కసారి కూడా నంది అవార్డుల ప్రదానం చేయలేదు. ఈ విషయం గురించి టాలీవుడ్ సినీ పెద్దలు పలుమార్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే నంది అవార్డులు ప్రదానం చేయడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

First Published:  1 May 2023 7:27 PM IST
Next Story