Telugu Global
Andhra Pradesh

కుమార్తెకు ప్రేమ పెళ్లి చేసిన వైసీపీ ఎమ్మెల్యే

అబ్బాయి తండ్రి ఆర్టీసీలో చిన్న మెకానిక్‌ అని వివరించారు. చదువుకునే సమయంలో పవన్‌ అనే యువకుడిని ఎమ్మెల్యే కుమార్తె ఇష్టపడ్డారు.

కుమార్తెకు ప్రేమ పెళ్లి చేసిన వైసీపీ ఎమ్మెల్యే
X

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కుమార్తెకు ప్రేమ వివాహం చేశారు. బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో సింపుల్‌గా పెళ్లితంతు జ‌రిగింది. అనంతరం ప్రొద్దుటూరు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించారు. తన కుమార్తెకు కులాంతర వివాహం చేసినందుకు గర్వపడుతున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. పెళ్లి ఘనంగా చేయాలని భావించానని, తన కుమార్తె మాత్రం సింపుల్‌గానే చేయాలని కోరిందని ఎమ్మెల్యే వివరించారు.

తనకు కుల పట్టింపు లేదని.. మా అమ్మాయి ఇష్టపడిన తర్వాత అతడి కులమే తన కులం అవుతుందని వ్యాఖ్యానించారు. అబ్బాయి తండ్రి ఆర్టీసీలో చిన్న మెకానిక్‌ అని వివరించారు. చదువుకునే సమయంలో పవన్‌ అనే యువకుడిని ఎమ్మెల్యే కుమార్తె ఇష్టపడ్డారు. అన్నింటి కంటే చదువు ముఖ్యమని, అబ్బాయి ఎంబీఏ చేసి హైదరాబాద్‌లో నెలకు రూ.80వేలు వచ్చే ఉద్యోగం చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.

అమ్మాయిల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే ఒక సలహా ఇచ్చారు. అమ్మాయి మనసు ఒకరి వ‌ద్ద ఉంటే మరొకరితో పెళ్లి చేయడం సరికాదని, అమ్మాయిలకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ‌ ఇవ్వాలని సూచించారు. ఒకవేళ అమ్మాయి నిర్ణయం తప్పు అయితే సలహా ఇచ్చే వరకు మాత్రమే తల్లిదండ్రులు పరిమితం కావాలని, లేదు అన్నింటినీ అధిగమించి నిలబడతా అని అమ్మాయి ధీమాగా చెబితే నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలన్నారు.

*

First Published:  7 Sept 2023 4:47 PM IST
Next Story