నా కాళ్లు మొక్కితే ఎమ్మెల్సీగా చేయించా- వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు
హైదరాబాద్ నుంచి వలస వచ్చి తన కాళ్ల మీద పడి విజ్ఞప్తి చేస్తే.. సీఎం జగన్, ఎంపీ అవినాష్‌తో మాట్లాడి ఎమ్మెల్సీ పదవి ఇప్పించానని రాచమల్లు చెప్పారు.
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్ ప్రత్యేకంగా ఒక గ్రూపును నడుపుతున్నారన్నా ప్రచారంపై రాచమల్లు స్పందించారు. గ్రూపును నడిపే సామర్థ్యం రమేష్ యాదవ్‌కు లేదని వ్యాఖ్యానించారు. రమేష్ యాదవ్ కూడా తన వర్గమే అన్న ఎమ్మెల్యే.. అతడిపై తనకు ప్రత్యేకంగా కోపం లేదు, అభిమానమూ లేదన్నారు. అతడేమీ తన తమ్ముడు కాదన్నారు. అసలు రమేష్ యాదవ్ రాజకీయ నాయకుడే కాదన్నారు.
హైదరాబాద్ నుంచి వలస వచ్చి తన కాళ్ల మీద పడి విజ్ఞప్తి చేస్తే.. సీఎం జగన్, ఎంపీ అవినాష్‌తో మాట్లాడి ఎమ్మెల్సీ పదవి ఇప్పించానని రాచమల్లు చెప్పారు. యాదవులకు ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే తాను సీఎంకు సిఫార్సు చేశానన్నారు. వచ్చే ఎన్నికల్లో రమేష్ యాదవ్ తనకు సహకరించకపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు.