మాజీ మంత్రి నారాయణపై కేసులో నన్నూ విచారించండి
సీఐడీ అధికారులు సోమవారం చేపట్టనున్న విచారణలో నారాయణ తనకేమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని తెలిపారు. కానీ, నారాయణకు అన్నీ తెలుసని ఆమె స్పష్టం చేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో మాజీ మంత్రి నారాయణను సీఐడీ అధికారులు సోమవారం విచారించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసులో తనను కూడా విచారించాలని సీఐడీని కోరుతూ నారాయణ మరదలు పొంగూరు ప్రియ శనివారం మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. నారాయణ తమ్ముడి భార్య అయిన పొంగూరు ప్రియ.. ఇటీవల ఆయనపై పలు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నారాయణపై సీఐడీ కేసు నమోదు చేయడంతో మరోసారి ఆమె స్వయంగా ఈ వీడియో విడుదల చేసి మీడియా ముందుకు వచ్చారు.
ఇంతకీ ఆ వీడియోలో ఆమె ఏం చెప్పారంటే.. సీఐడీ అధికారులు సోమవారం చేపట్టనున్న విచారణలో నారాయణ తనకేమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉందని తెలిపారు. కానీ, నారాయణకు అన్నీ తెలుసని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు.. నారాయణకు ఎక్కడెక్కడ బినామీల పేరుతో స్థలాలు ఉన్నాయో తనకు తెలుసని ఆమె వివరించారు. సీఐడీ అధికారులు ఈ కేసులో భాగంగా తనను కూడా విచారణ చేయాలని ఆమె కోరారు. తద్వారా తాను దర్యాప్తునకు సహకరించినట్టు అవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఒక పర్సన్ వల్ల తీగ లాగితే డొంక కదులుతుందని ప్రియ చెప్పారు.
రింగ్ రోడ్ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో అధికారులకు తెలుస్తుందని వివరించారు. ఆ పర్సన్ ఎవరో విచారణలో తాను వెల్లడిస్తానని ఆమె తెలిపారు. ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో సీఐడీ అధికారులకు ఉపయోగపడుతుందని ఆ వీడియోలో ప్రియ పేర్కొన్నారు. మరి ఆమె విజ్ఞప్తిపై సీఐడీ అధికారులు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి.