చంద్రబాబు రూమ్ లో 8 ఫ్యాన్లు.. రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు
జైలు నిబంధనల ప్రకారం చంద్రబాబుకి ఏసీ, కూలర్ ఇవ్వలేమని చెప్పిన జైళ్ల శాఖ డీఐజీ.. ఆయనకు దోమ తెర అందించామని చెప్పారు. చంద్రబాబు రూమ్ లో 8 ఫ్యాన్స్ పెట్టామన్నారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, కుటుంబ సభ్యుల విమర్శల నేపథ్యంలో నేరుగా జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ లో అన్ని వివరాలను ఆయన వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. జైలులో అనుమతి ఉన్న అన్ని సౌకర్యాలు ఆయనకు అందుతున్నాయని చెప్పారు. భోజనాన్ని కూడా తనిఖీ చేసి ఆయనకు పంపిస్తున్నామని, తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు డీఐజీ.
జైలు నిబంధనల ప్రకారం చంద్రబాబుకి ఏసీ, కూలర్ ఇవ్వలేమని చెప్పిన జైళ్ల శాఖ డీఐజీ.. ఆయనకు దోమ తెర అందించామని చెప్పారు. చంద్రబాబు రూమ్ లో 8 ఫ్యాన్స్ పెట్టామన్నారు. చంద్రబాబు దగ్గరకు వేరే ఏ ఖైదీని అనుమతించడం లేదని, ఆయన ఉన్న స్నేహ బ్యారెక్ లో 100మంది ఖైదీలు ఉండేవారని, వారందర్నీ అక్కడినుంచి ఖాళీ చేయించి వేరే బ్యారక్ లకు సర్దుబాటు చేశామని స్పష్టం చేశారు.
నీరు కలుషితం అవాస్తవం..
రాజమండ్రి సెంట్రల్ జైలులోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నీరు కలుషితంగా ఉందని కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్ని కూడా జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఖండించారు. నీరు కలుషితం అయితే ఖైదీలందరికీ సమస్యలు రావాలి కదా అని అడిగారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు. భద్రతాపరంగా కూడా ఎలాంటి సమస్య లేదన్నారు. ఆయనను హైప్రొఫైల్ ఖైదీగానే ట్రీట్ చేస్తున్నామని చెప్పారు. చర్మ సంబంధిత సమస్య రాగానే ప్రభుత్వ వైద్యులతో రూల్స్ ప్రకారం వైద్యం చేయించామని వెల్లడించారు. చంద్రబాబు బ్యారక్ నుంచి బయటికి వచ్చే సమయంలో ఇతర ఖైధీలు లేకుండా చూసుకుంటున్నామని చెప్పారు.
ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్..
విమర్శలు రావడంతో ఇకపై ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు డీఐజీ. చంద్రబాబుకి ఇంటినుంచి పంపిస్తున్న మందుల్ని ఆయన వేసుకుంటున్నారో లేదో పరిశీలిస్తున్నామని చెప్పారు. రోజుకి మూడుసార్లు ఆయనకు టెంపరేచర్, బీపీ, పల్స్ టెస్ట్ చేస్తున్నామని తెలిపారు. డీహైడ్రేషన్ కలగకుండా ఆయన రూమ్ లో వాటర్ బాటిల్స్ పెట్టామని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నామని అన్నారు. జైళ్ల శాఖ డీఐజీ ప్రెస్ మీట్ పై కూడా టీడీపీ రాద్ధాంతం మొదలు పెట్టింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ నే ఆయన మీడియా ముందు చదివారని విమర్శించారు టీడీపీ నేతలు.