Telugu Global
Andhra Pradesh

అది నకిలీ లేఖ.. జైళ్లశాఖ డీఐజీ వివరణ

చంద్రబాబు కుడి కంటి కేటరాక్ట్‌ ఆపరేషన్‌ కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్‌ వైద్యుల సలహా తీసుకున్నామని.. ఆయనకు ఆపరేషన్ అర్జెంట్ గా చేయాల్సిన అవసరం లేదన్నారు డీఐజీ రవికిరణ్.

అది నకిలీ లేఖ.. జైళ్లశాఖ డీఐజీ వివరణ
X

జైలులో తన భద్రత గురించి ఏసీబీ కోర్టు జడ్జికి ఫిర్యాదు చేస్తూ చంద్రబాబు రాసిన సుదీర్ఘ లేఖకు అంతే సుదీర్ఘ వివరణ ఇచ్చారు జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్. చంద్రబాబుకి ప్రాణహాని తలపెడతామంటూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి వచ్చిందంటున్న బెదిరింపు లేఖ పూర్తిగా ఫేక్ అని అన్నారు. మావోయిస్ట్ ల పేరుతో వచ్చిన ఆ లేఖ నకిలీదని తాము గుర్తించినట్టు చెప్పారు. ఇక జైలు నుంచి ప్రజలనుద్దేశిస్తూ చంద్రబాబు రాసిన లేఖపై జైలు అధికారుల అటెస్టేషన్ లేదని వివరణ ఇచ్చారు డీఐజీ రవికిరణ్. జైలు లోపల, బయట.. సెక్యూరిటీ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదని చెప్పారు.

జైలులో 24గంటల సెక్యూరిటీతోపాటు అడిషనల్‌ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ నడుస్తోందన్నారు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్. జైలు చుట్టూ ఐదు వాచ్‌ టవర్స్‌ ఉన్నాయని, బీపీఓ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ జరుగుతోందన్నారు. ప్రతి గంటకు గార్డ్‌ సెర్చ్‌ చేస్తుంటారని చెప్పారు. ఈనెల 22న జైలు వాటర్‌ ట్యాంక్‌ వైపు డ్రోన్‌ తిరిగిందని తమకు సమాచారం వచ్చిందని, అయితే చంద్రబాబు ఉండే క్లోజ్డ్‌ జైల్‌ వైపు ఆ డ్రోన్‌ రాలేదని వివరణ ఇచ్చారాయన. డ్రోన్ విషయంలో తాము సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారమిచ్చామని తెలిపారు డీఐజీ.

గంజాయి లేనే లేదు..

జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరే అవకాశమే లేదని, చంద్రబాబు వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు అలాంటి సంఘటనే జరగలేదన్నారు డీఐజీ రవికిరణ్. జైలులోకి వచ్చే ప్రతీ ఖైదీని పూర్తిగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తామన్నారు. శ్రీనివాస్‌ అనే ఖైదీ బటన్‌ కెమెరా తీసుకొచ్చాడని, అది స్వాధీనం చేసుకున్నామని, అందులో ఎలాంటి ఫుటేజి లేదన్నారు. చంద్రబాబు జైలులోకి వచ్చిన రోజు బయటకొచ్చిన ఫొటోల విషయంలో విచారణ జరుగుతోందని చెప్పారు.

ఆపరేషన్ ఇప్పుడే అవసరం లేదు

చంద్రబాబు కుడి కంటి కేటరాక్ట్‌ ఆపరేషన్‌ కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్‌ వైద్యుల సలహా తీసుకున్నామని.. ఆయనకు ఆపరేషన్ అర్జెంట్ గా చేయాల్సిన అవసరం లేదన్నారు డీఐజీ రవికిరణ్. ఆయన ఆరోగ్యానికి సంబంధించి తాము ఎలాంటి తప్పుడు రిపోర్టు బయటకు ఇవ్వలేదని చెప్పారు. చంద్రబాబు అలర్జీలకు సంబంధించి కుటుంబ సభ్యులకు రెండు లెటర్లు రాశామని.. ఆయన వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి ఎలాంటి చికిత్స అవసరమో సలహా తీసుకోవాలని ఆయన భార్య భువనేశ్వరికి తెలియజేశామని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట 24 గంటలు పహారా ఉంటుందన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్‌. జైలు చుట్టుపక్కల సీసీ కెమెరాల ఏర్పాటు ఉందన్నారు. ఇక మావోయిస్ట్ ల పేరుతో వచ్చిన లేఖ ఫేక్ అని ఆయన తేల్చి చెప్పారు.

First Published:  27 Oct 2023 10:16 PM IST
Next Story