ఏదీ నన్ను కొట్టు చూద్దాం! - టీచర్లకు ప్రవీణ్ ప్రకాష్ క్లాస్
తాను ఏం మాట్లాడినా వివాదం చేస్తున్నారని.. ఉపాధ్యాయులు సక్రమంగా చదువు చెబితే తానెందుకు మాట్లాడుతానని వ్యాఖ్యానించారు.
ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ వరుసపెట్టి స్కూళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన వస్తున్నారంటే చాలు టీచర్లు వణికిపోతున్నారు. సరదాగా స్కూల్‌కు వచ్చి వెళ్లే ఉపాధ్యాయులకు పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. సిలబస్ పూర్తి చేయకపోవడం, పిల్లలు ఎలా చదవుతున్నారు? ఇచ్చిన హోంవర్క్ చేస్తున్నారా లేదా? అని పరిశీలించే తీరిక కూడా లేని టీచర్లపై ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.
ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పర్యటించిన ప్రవీణ్ ప్రకాశ్ అక్కడా టీచర్లకు క్లాస్ తీసుకున్నారు. వినుకొండ మండలం బ్రహ్మణపల్లి హరిజనవాడ స్కూల్‌ను తనిఖీ చేసేందుకు ప్రవీణ్ ప్రకాశ్ వెళ్లగా.. అక్కడ సరిగా విద్యాబోధన జరగడం లేదని గుర్తించారు. మూడు నెలలుగా ఐదో తరగతి విద్యార్థుల హోంవర్క్ పుస్తకాలను టీచర్ పరిశీలించకపోవడాన్ని గుర్తించిన ప్రవీణ్ ప్రకాశ్... ఉపాధ్యాయుడు మస్తాన్‌వలిని నిలదీశారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నప్పుడు .. ఆ జీతానికైనా న్యాయం చేయాలి కదా అని ప్రశ్నించారు.
సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఉపాధ్యాయుడి వద్ద కర్ర ఉండడంపైనా ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను కొట్టడానికి కర్ర తెచ్చారా అంటూ ప్రశ్నించారు. ఏదీ ఆ కర్రతో నన్ను కొట్టండి చూద్దాం అంటూ చేయి చాచారు. తాను ఏం మాట్లాడినా వివాదం చేస్తున్నారని.. ఉపాధ్యాయులు సక్రమంగా చదువు చెబితే తానెందుకు మాట్లాడుతానని వ్యాఖ్యానించారు.
ప్రకాశం జిల్లా కురిచేడులో పర్యటించిన ప్రవీణ్ ప్రకాశ్ అక్కడ బైజూస్ కంటెంట్‌ను సరిగా ఉపయోగించడం లేదని గుర్తించారు. నెలవారీ సిలబస్ పూర్తి కాలేదని తేల్చారు. బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇస్తే వాటిని పిల్లలు ఉపయోగించేలా ఎందుకు చేయడం లేదని హెచ్‌ఎంను ప్రశ్నించారు. క్లాస్‌లో బైజూస్ కంటెంట్‌ను వాడుకుంటున్న ఐదుగురు విద్యార్థుల పేర్లు చెప్పాలని ఉపాధ్యాయుడిని కోరారు. అందుకు టీచర్ నుంచి సమాధానం లేదు. తామేమీ బైజూస్, శాంసంగ్ కంపెనీల దగ్గర కమీషన్లు తీసుకుని వాటిని అందించలేదని...ధర్మంగా, నిజాయితీగా వాటిని పంపిణీ చేశామన్నారు. అయినా సరే వాటిని ఉపయోగించకపోవడం ఏంటని ప్రశ్నించారు. తనకు లక్షా 80వేలు జీతంగా వస్తుందని.. దానికి తగ్గట్టు పని లేదనే తాను ఢిల్లీ నుంచి తిరిగి రాష్ట్రానికి వచ్చి కష్టపడుతున్నానని ప్రవీణ్ ప్రకాశ్ వివరించారు.