అటు తెలుగుదేశం.. ఇటు జనసేన.. మధ్యలో నలిగిపోయిన రఘురామ
జనసేన, టీడీపీ పొత్తుంటుందని రఘురామ కూడా బలంగా నమ్మారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున నరసాపురం లేదా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
నరేంద్ర మోడీ రెండు రోజుల విశాఖపట్నం పర్యటన కొన్నిపార్టీలతో పాటు వ్యక్తుల ఆశలపైన కూడా నీళ్ళు చల్లినట్లే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఐక్య పోరాటాలు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు ముందు షాక్ కొట్టింది. మోడీతో జరిగిన పవన్ భేటీ తర్వాత జనసేనాని వైఖరిలో మార్పొచ్చేసింది. మోడీ పర్యటన దగ్గర నుండి పవన్ అసలు టీడీపీ ఊసు కూడా ఎత్తటం లేదు. ఎక్కడ పర్యటించినా ఎవరితో మాట్లాడినా జనసేనను అధికారంలోకి తీసుకురావాలని మాత్రమే చెబుతున్నారు.
సో రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న టీడీపీ, జనసేనకు మోడీ పర్యటన నీళ్ళు చల్లినట్లయ్యింది. ఇదే సమయంలో వీళ్ళతో కలవాలని అనుకున్న కాంగ్రెస్, వామపక్షాలకు కూడా తీవ్ర నిరాస ఎదురైంది. సీపీఐ సెక్రటరీ రామకృష్ణ మాటలు, ఆరోపణలు, విమర్శల్లో ఆ విషయం స్పష్టంగా కనబడుతోంది. మూడు రోజులుగా పవన్‌ను సీపీఐ సెక్రటరీ పదేపదే టార్గెట్ చేస్తున్నారు. సరే పార్టీల సంగతి ఇలాగుంటే వ్యక్తిగా వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆశలపైన కూడా మోడీ నీళ్ళు చల్లినట్లే అయ్యింది.
జనసేన, టీడీపీ పొత్తుంటుందని రఘురామ కూడా బలంగా నమ్మారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున నరసాపురం లేదా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తనకున్న పరిచయాలతో ఇటు చంద్రబాబు అటు పవన్‌తో మాట్లాడుకున్నారని సమాచారం. రెండు పార్టీల మధ్య పొత్తు ప్రకటన ఆలస్యం.. వెంటనే రఘురామ జనసేనలో చేరాలని కూడా అనుకున్నట్లు తెలిసింది.
అలాంటిది తాజా పరిణామాలతో రఘురామ పూర్తి నిరాసలో కూరుకుపోయారట. ఎందుకంటే జనసేన, టీడీపీలు విడిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు దాదాపు లేవనే అనుకోవాలి. రెండు పార్టీల మధ్య ఓట్లలో చీలిక వచ్చేస్తే తాను గెలవటం కష్టమని తిరుగుబాటు ఎంపీకి బాగా తెలుసు. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి రఘురామ ఏదో రకంగా నెట్టుకొచ్చేస్తున్నారు. ఒకసారి మాజీ ఎంపీ అయి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇక రఘురామ పరిస్ధితి ఏమిటో ఎవరికి వాళ్ళుగా ఊహించుకోవాల్సిందే.