Telugu Global
Andhra Pradesh

రోడ్డూ లేదు మ్యాపూ లేదా?

విశాఖపట్నంలో మోడీతో భేటీ అయిన సందర్భంలో కూడా పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావించారట. దీనికి మోడీ బదులిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటే రోడ్ మ్యాప్ అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండదని చిత్తుశుద్దితో పోరాటాలు చేయటమే అని స్పష్టంగా చెప్పేశారట.

రోడ్డూ లేదు మ్యాపూ లేదా?
X

నరేంద్ర మోడీ రెండు రోజుల ఏపీ పర్యటన తర్వాత బీజేపీలో ఇదే టాక్ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ గడచిన తొమ్మిది నెలలుగా రోడ్ మ్యాప్ అంటూ పదేపదే గొంతు చించుకుంటున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలో మోడీతో భేటీ అయిన సందర్భంలో కూడా పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావించారట. దీనికి మోడీ బదులిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటే రోడ్ మ్యాప్ అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండదని చిత్తుశుద్దితో పోరాటాలు చేయటమే అని స్పష్టంగా చెప్పేశారట.

బీజేపీ, జనసేన పార్టీలు ఐక్య పోరాటాలు చేస్తే సరిపోతుందని కూడా చెప్పారట. ఇప్పటివరకు రెండు పార్టీలు కలిసి చేసిన పోరాటాలు ఏమీలేవన్న విషయాన్ని పవన్‌కు మోడీ గుర్తుచేశారట. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటే రెండు పార్టీల నేతలు కూర్చుని కార్యాచరణను ప్లాన్ చేసుకోమని స్పష్టంగా చెప్పారని పార్టీ వర్గాలు చెప్పాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని అనుకున్నపుడు అందుబాటులో ఉన్న మార్గాల్లో నిరసనలు తెలపటమే రోడ్ మ్యాప్ అని చెప్పారట.

మోడీ తాజాగా చేసిన ఉపదేశంతో పవన్ మైండ్ బ్లాంక్ అయిపోయినట్లు సమాచారం. ఈ విషయమే మోడీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడినపుడు పవన్ బాడీ ల్యాంగ్వేజ్ చూసినవారికి స్పష్టంగా అర్ధమైపోతుంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే పవన్ దృష్టిలో రోడ్ మ్యాప్ అంటే చంద్రబాబునాయుడును కూడా మిత్రపక్షంగా కలుపుకోవటమే. ఎందుకంటే పవన్ మనసంతా చంద్రబాబుతో చేతులు కలపటంపైనే ఉంది.

ఇదే సమయంలో బీజేపీ ఆలోచనంతా చంద్రబాబును దూరంగా పెట్టడంపైనే ఉంది. సరిగ్గా ఇక్కడే బీజేపీ-పవన్ ఆలోచనల్లో స్పష్టమైన తేడా తెలిసిపోతోంది. పవన్‌కు వచ్చిన క్లారిటి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటానికి ప్రత్యేకమైన రోడ్ మ్యాప్ అంటూ ఏమీలేదని. ఎన్నికల ముందు తాను దిశానిర్దేశం చేస్తానని మోడీ చెప్పారట. మనసులో ఏముందో తెలీదుకానీ వచ్చే ఎన్నికల్లో జనసేనకు అధికారం ఇవ్వండంటు మొదలుపెట్టారు. బీజేపీతో పొత్తు కంటిన్యూ చేస్తారా? లేకపోతే మోడీ మాటను థిక్కరించి బీజేపీతో పొత్తును కటీఫ్ చేసుకుని ఎన్నికలకు ముందు చంద్రబాబుతో కలుస్తారా? అన్నది చూడాలి.

First Published:  16 Nov 2022 5:13 AM GMT
Next Story