Telugu Global
Andhra Pradesh

జగన్‌ పేరెత్తని మోదీ.. బాబు, పవన్‌ ఆశలపై నీళ్లు!

ప్రధాని మోదీ స్పీచ్‌ ఒక రకంగా బాబుకు, ఆయన దత్త పుత్రుడి పవన్ కల్యాణ్‌కు షాక్ ఇచ్చింది. వైసీపీ, జగన్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శలు చేసినప్పటికీ... అవి రాజకీయ నాయకుల నోటి నుంచి సర్వసాధారణంగా వినిపించేవే.

జగన్‌ పేరెత్తని మోదీ.. బాబు, పవన్‌ ఆశలపై నీళ్లు!
X

చిలకలూరిపేట ప్రజాగళం సభపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. పొత్తు కుదిరాక నిర్వహించిన మొదటి సభ కావడం, ప్రధాని మోదీ హాజరుకావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలన్ని తలకిందులయ్యాయి. వైసీపీ, జగన్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేస్తారనుకున్న తెలుగుదేశం, జనసేన నాయకుల కలలు చెదిరిపోయాయి.

ప్రధాని మోదీ స్పీచ్‌ ఒక రకంగా బాబుకు, ఆయన దత్త పుత్రుడి పవన్ కల్యాణ్‌కు షాక్ ఇచ్చింది. వైసీపీ, జగన్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శలు చేసినప్పటికీ... అవి రాజకీయ నాయకుల నోటి నుంచి సర్వసాధారణంగా వినిపించేవే. ప్రధాని మోదీ...తన ప్రసంగంలో ఎక్కడా.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు పోలేదు. తన స్పీచ్‌ మొత్తం ఎన్డీఏ కూటమి అంటూ సాగింది తప్ప.. తెలుగుదేశం, జనసేన పేర్లు కూడా పెద్దగా ప్రస్తావించలేదు.

దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు సాగిన మోదీ ప్రసంగంలో.. జగన్, వైసీపీ ప్రస్తావనకు ఇచ్చిన సమయం 3 నిమిషాలు కూడా ఉండదు. ప్రధానంగా ఏపీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాన్ని దింపాలనుకుంటున్నారని, ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారంటూ సాదాసీదా విమర్శలకే మోదీ పరిమితమయ్యారు. ఇక కాంగ్రెస్‌పైనా మోదీ విమర్శలు చేశారు. మొత్తంగా మోదీ ప్రసంగం వింటే జగన్‌పై ప్రత్యేకంగా ద్వేషం కానీ.. చంద్రబాబుపై ప్రేమ కానీ లేదని అర్థం చేసుకోవచ్చు. ఇక జనసేనాని లెక్కలోనే లేరు. రాబోయే సభల్లోనూ మోదీ ప్రసంగం ఇంతకంటే గొప్పగా ఉంటుందని ఊహించలేం.

First Published:  17 March 2024 8:58 PM IST
Next Story