జగన్‌పై ఒత్తిడి పెరిగిపోతోందా..?
మంత్రులు, ఉన్నతాధికారులు రివ్యూ మీటింగుల్లో తప్ప ఇతరత్రా సమయాల్లో జగన్‌ను కలవటం చాలా కష్టమనే ప్రచారముంది. అలాగే ఎమ్మెల్యేలు జగన్‌ను కలవాలన్నా అది ఇంకా కష్టమే అని ప్రచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి పెరిగిపోతున్నట్లుంది. కారణం ఏమిటంటే.. ఇద్దరు సీఎంల మధ్య రాజకీయ నేతలతో పాటు మామూలు జనాలు కూడా ఒక విషయంలో పోలిక తీసుకువస్తుండటమే. ఇంతకీ విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రెండోరోజు నుంచి రేవంత్ ప్రజాదర్బార్ మొదలుపెట్టారు. సమస్యలతో వచ్చిన జనాలను కలిసి పరిష్కారానికి కృషిచేయటం కోసం ఉద్దేశించిందే ప్రజాదర్భార్.
నిజానికి ప్రజాదర్బార్ అన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ స్టైల్. వైఎస్సార్ బతికున్నంతకాలం ప్రతిరోజు ఉదయం జనాలను కలిసేవారు. సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే వివిధ శాఖల ఉన్నతాధికారులకు దరఖాస్తులను పంపేవారు. తన సిఫారసుతో వివిధ శాఖలకు వెళ్ళిన దరఖాస్తులు ఏమయ్యాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక సెల్‌ను కూడా వైఎస్సార్ ఏర్పాటుచేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ అవలంభించిన అనేక మార్గాల్లో ప్రజాదర్బార్ కూడా ఒకటి. దాన్నే ఇప్పుడు రేవంత్ కూడా ఫాలో అవుతున్నారు.
సీన్ కట్ చేస్తే.. జగన్ కూడా ప్రజాదర్బార్ ఎందుకు మొదలుపెట్టకూడదనే ప్రశ్నలు మొదలయ్యాయి. మంత్రులు, ఉన్నతాధికారులు రివ్యూ మీటింగుల్లో తప్ప ఇతరత్రా సమయాల్లో జగన్‌ను కలవటం చాలా కష్టమనే ప్రచారముంది. అలాగే ఎమ్మెల్యేలు జగన్‌ను కలవాలన్నా అది ఇంకా కష్టమే అని ప్రచారం. నిజానికి జగన్ స్టైల్ ఏమిటంటే.. ప్రజా సమస్యలను ఉన్నతాధికారుల ద్వారానే పరిష్కారమయ్యేట్లు చూడటం. ఇందుకనే స్పందన అని, జగనన్నకు చెబుదాం అనే పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1902 లాంటివి ఏర్పాటు చేశారు.
స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ల దగ్గర నుంచి కలెక్టర్ల వరకు డైరెక్టుగా పాల్గొంటున్నారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1902 వచ్చే సమస్యల పరిష్కారం, ఫాలోఅప్ కోసం ప్రత్యేక యంత్రాంగానే ఏర్పాటు చేశారు. అయినా సరే జనాలను డైరెక్టుగా ఎందుకు కలవరనే ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు కూడా ప్రజావేదిక అని పెట్టారు కానీ, అందులో చంద్రబాబు మామూలు పబ్లిక్‌ను కలిసింది చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు రేవంత్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌ను చూపించి జగన్‌పైన కూడా ఒత్తిడి పెంచేస్తున్నారు.