టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్ట్
ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ చిలకలూరి పేట టీడీపీ అభ్యర్థి కూడా కావడం విశేషం. ఇటీవలే శరత్ కు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు.
ఎన్నికల వేళ ఏపీలో మరో రాజకీయ కలకలం ఇది. టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ ని కృష్ణా జిల్లా మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు శరత్ చిలకలూరి పేట టీడీపీ అభ్యర్థి కూడా కావడం విశేషం. ఇటీవలే శరత్ కు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. ఈ క్రమంలో అతడి అరెస్ట్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
ఎందుకీ అరెస్ట్..?
ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్.. అవేక్సా కార్పొరేషన్ అనే కంపెనీ నడుపుతున్నారు. ఆ కంపెనీ జీఎస్టీ వ్యవహారంలో గోల్ మాల్ జరిగింది. జీఎస్టీ ఎగవేశారంటూ అధికారులు ఫిర్యాదు చేయడంతో మాచవరం పోలీసులు కంపెనీ యజమాని శరత్ పై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టి ఈరోజు అరెస్ట్ చేశారు.
వివాదాల్లో ప్రత్తిపాటి ఫ్యామిలీ..
టీడీపీ అధికారంలో ఉండగా.. మంత్రి హోదాలో ప్రత్తిపాటి పుల్లారావు అనేక అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. గతంలో అగ్రిగోల్డ్ ఆస్తులు అక్రమంగా ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మకు బదిలీ అయినట్టు సీఐడీ విచారణలో తేలింది. ఇదే నెలలో ఈ ఆస్తుల్ని ఏపీ సీఐడీ అటాచ్ చేసింది. మొత్తం 12 ఎకరాల భూములు అగ్రిగోల్డ్ నుంచి ప్రత్తిపాటి కుటుంబానికి బదిలీ కాగా వాటిలో కొంత భూమిని మరికొందరి పేర్ల మీదకు మళ్లించారని గుర్తించారు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే ప్రత్తిపాటి కొడుకు శరత్ జీఎస్టీ కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. సహజంగానే ఈ అరెస్ట్ ల వ్యవహారాన్ని టీడీపీ నేతలు ఖండించారు. దీన్ని రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. ఎన్నికల వేళ టీడీపీ నేతల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకే శరత్ ని అరెస్ట్ చేశారని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.