నేను రూ.20 కోట్ల లంచం అడగలేదు - పుల్లారావు
ఆరోపణలను బ్రహ్మనాయుడు నిరూపించాలని ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ చేశారు. డబ్బులు అడగలేదని ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని చెప్పారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టెక్స్‌టైల్ పార్కు విషయంలో స్వయంగా తననే 20 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారని, ఆ తర్వాత చంద్రబాబు మనుషులను పంపించి టీడీపీలో చేరపోతే పార్కు రద్దు చేస్తామని బెదిరించారని ఇటీవల అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. తాను పుల్లారావు, చంద్రబాబు ప్రతిపాదనలకు అంగీకరించకపోవడంతో టెక్స్‌టైల్ పార్కు స్థలాన్ని వెనక్కు తీసుకున్నారని ఎమ్మెల్యే వివరించారు.
ఈ ఆరోపణలను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. తాను రూ.20 కోట్లు లంచం అడిగినట్టు వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ ఆరోపణలను బ్రహ్మనాయుడు నిరూపించాలని సవాల్ చేశారు. డబ్బులు అడగలేదని ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన 40 కోట్ల రూపాయల సబ్సిడీ సొమ్మును కాజేసేందుకు బ్రహ్మనాయుడు ప్రయత్నించారని.. అది సాధ్యం కాకపోవడంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
బ్రహ్మనాయుడిపై పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో తన ప్రమేయం లేదన్నారు పుల్లారావు. వెంకటరావు అనే వ్యక్తి కొనుగోలు చేసిన 300 ఎకరాల్లో తనకు 25 శాతం వాటా ఇచ్చినట్టు వస్తున్న ఆరోపణలనూ ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు.