Telugu Global
Andhra Pradesh

వైఎస్ జగన్‌తో త్వరలో ప్రశాంత్ కిషోర్ భేటీ..? ఇక టార్గెట్ షురూ

మ్యానిఫెస్టోలో చెప్పిన పథకాల్ని 98% అమలు చేశామని వైసీపీ ప్రభుత్వం చెప్తోంది. కానీ రాబోవు ఎన్నికల్లో కూడా ఇదే మ్యానిఫెస్టోతో వెళ్లడం మంచిది కాదని వైసీపీ భావిస్తోంది.

వైఎస్ జగన్‌తో త్వరలో ప్రశాంత్ కిషోర్ భేటీ..? ఇక టార్గెట్ షురూ
X

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడాదిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే గత కొన్ని నెలలుగా తన ఐప్యాక్ టీమ్ క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అభిప్రాయాల్ని సేకరిస్తోంది. అలానే గడపగడపకి మన ప్రభుత్వం, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాలలో ఎమ్మెల్యేల తీరుపై కూడా సమగ్ర నివేదికని ఇప్పటికే ఐప్యాక్ సెంట్రల్ ఆఫీస్‌కి ఏపీలోని టీమ్ అందజేసింది. అలానే సంక్షేమ పథకాలు అమలు, ప్రజా వ్యతిరేకతపై కూడా వేర్వేరు నివేదికల్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా ఈ రిపోర్ట్‌ని వైఎస్ జగన్‌కి సమర్పించబోతున్న ప్రశాంత్ కిషోర్.. భవిష్యత్ కార్యాచరణపై సూచనలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి క్షేత్రస్థాయిలో కొంత మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. మరికొంత మంది రాబోవు ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ 50:50 మాత్రమే. ఈ మేరకు అభ్యర్థుల్ని మార్చడం లేదా పనితీరు మార్చుకోమని హెచ్చరించడంపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలానే గత కొంతకాలంగా టీడీపీ, జనసేన పొత్తు ప్రభావంపై కూడా ఐప్యాక్ టీమ్ క్షేత్రస్థాయిలో సర్వే చేసినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్ట్ కూడా ప్రశాంత్ కిషోర్‌ చేతికి చేరినట్లు సమాచారం. ఇప్పటికే ఈ పొత్తుపై క్లాస్‌ వార్‌ అంటూ వైఎస్ జగన్ కౌంటర్ కూడా ఇస్తున్నారు. ఇదే వ్యూహాన్ని అమలు చేయాలా? లేదా ప్లాన్ మార్చాలా అనే కోణంలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

మ్యానిఫెస్టోలో చెప్పిన పథకాల్ని 98% అమలు చేశామని వైసీపీ ప్రభుత్వం చెప్తోంది. కానీ రాబోవు ఎన్నికల్లో కూడా ఇదే మ్యానిఫెస్టోతో వెళ్లడం మంచిది కాదని వైసీపీ భావిస్తోంది. దాంతో కొద్దిగా మార్పులు చేసే అవకాశం ఉంది. నవరత్నాల అమలుని కొనసాగిస్తూనే అదనంగా కొన్ని పథకాల్ని యాడ్ చేసే దిశగా ఐప్యాక్ టీమ్ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. నిరుద్యోగ యువతని టార్గెట్‌గా చేసుకుని ఈ పథకాలు ఉండే అవకాశం ఉంది. ఈ మ్యానిఫెస్టో మార్పులు, చేర్పులపై కూడా ప్రశాంత్ కిషోర్ తన టీమ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వైఎస్ జగన్‌కి సూచనలు చేయబోతున్నట్లు సమాచారం.

కేవలం మంత్రులు, ఎమ్మెల్యేల మాటతీరు, పనితీరుపై ఆధారపడకుండా ఇటీవల వైఎస్ జగన్ స్వయంగా క్షేత్రస్థాయి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బహిరంగ సభ వేదికల వద్ద, హెలిప్యాడ్ వద్ద ఏ కొద్ది సమయం దొరికినా సెకండ్ గ్రేడ్ నాయకులతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. అలానే కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య అంతర్గత విభేదాల్ని తొలగించేందుకు స్వయంగా రంగంలోకి దిగి రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్‌గా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సమర్పించబోయే నివేదిక ఆధారంగా వైఎస్ జగన్ తన వ్యూహాల్ని మార్చుకునే అవకాశం ఉంది.

ఏపీలో ప్రతి మంత్రి, ఎమ్మెల్యే వద్ద ఇప్పటికే ఒక ఐప్యాక్ మెంబర్ ఉన్నారు. వాళ్లు క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. దాంతో వైఎస్ జగన్‌కి కూడా ఐప్యాక్‌పై బాగా గురి కుదిరింది. కాబట్టి.. ప్రశాంత్ కిషోర్ సూచనల్ని తూ.చ తప్పకుండా పాటించే అవకాశం ఉంది.

First Published:  26 May 2023 9:17 AM IST
Next Story