Telugu Global
Andhra Pradesh

ఖద్దర్ తో కలిసి ఖాకీ బ్యాంకాక్ విహారం

మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తో పాటు కొందరు కౌన్సిలర్లు, వైసీపీ సర్పంచులతో కలిసి మొత్తం 20 మంది బ్యాంకాక్ వెళ్లిపోయారు.

ఖద్దర్ తో కలిసి ఖాకీ బ్యాంకాక్ విహారం
X

ప్రకాశం జిల్లాలో ఖద్దర్, ఖాకీ, రెవెన్యూ అధికారులు ఏకమయ్యారు. అందరూ కలిసి బ్యాంకాక్ చెక్కేశారు. అది కూడా ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించి. దర్శి ఎస్ఐ చంద్రశేఖర్ తనకు ఐదు రోజుల లీవ్ కావాలంటూ ఇటీవల అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదు ఆసుపత్రి పనులు చూసుకోవాలంటూ సెలవు పెట్టారు. అధికారులు కూడా సెలవు మంజూరు చేశారు. అయితే చంద్రశేఖర్ ఇక్కడ కనిపించలేదు. బ్యాంకాక్ లో విహరిస్తున్నారు.

ఆయనే కాదు రెవెన్యూ శాఖలో కీలకపాత్ర పోషించాల్సిన దర్శి డిప్యూటీ తహసీల్దార్ రవిశంకర్ కూడా ఇదే మార్గంలో బ్యాంకాక్ వెళ్లారు. వీరు వెళ్లింది కూడా రాజకీయ నాయకులతో కలిసి. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తో పాటు కొందరు కౌన్సిలర్లు, వైసీపీ సర్పంచులతో కలిసి మొత్తం 20 మంది బ్యాంకాక్ వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమారం రేగే వరకు ఉన్నతాధికారులు కూడా గుర్తించలేకపోయారు.

తండ్రికి ఆరోగ్యం బాగోలేదంటూ సాధారణ సెలవు పెట్టి వెళ్లిన చంద్రశేఖర్ బ్యాంకాక్ లో తేలడంతో ఉన్నతాధికారులు కూడా కంగుతిన్నారు. చంద్రశేఖర్ సాధారణ లీవ్ పెట్టారని ఆయన బ్యాంకాక్ వెళ్ళినట్టు తమ దృష్టికి కూడా వచ్చిందని డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి చెప్పారు. ఎస్సై తీరుపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఉప తహసీల్దార్ రవిశంకర్ కూడా ఇదే తరహాలో సాధారణ లీవ్ పెట్టి చెప్పా పెట్టకుండా విదేశాలకు వెళ్లడంపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కూడా సీరియస్ గా స్పందించారు.

పైగా ఎస్సై, ఉప తహసీల్దార్ వెళ్లిన బృందంలో కొందరు రేషన్ డీలర్లు కూడా ఉండడంతో ఈ అంశం మరింత వివాదాస్పదమవుతోంది. అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లకు వీరు సహకారం కూడా అందిస్తున్నారని అందుకే వారితో కలిసే వీరు విదేశాలకు వెళ్లారు అన్న చర్చ కూడా నడుస్తోంది . క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చే పోలీస్ శాఖలో ఏ పోలీస్ అయినా విదేశాలకు వెళ్లాలంటే ఉన్నతాధికారులకు తప్పనిసరిగా పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. వారు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు అన్న అంశాలను కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఎస్ఐ చంద్రశేఖర్ మాత్రం తండ్రికి అనారోగ్యం పేరు చెప్పి సాధారణ లీవ్ పెట్టి రహస్యంగా విదేశాలకు వెళ్లడంతో పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

ఎస్సై చంద్రశేఖర్ ఇలా రహస్యంగా రాజకీయ నాయకులతో కలిసి బ్యాంకాక్ వెళ్లడంపై ఎస్పీ మల్లికా గార్గ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ పాస్ పోర్ట్, ఇమ్మిగ్రేషన్ సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుమతి లేకుండా పోలీస్ శాఖ ఉద్యోగులు విదేశాలకు వెళ్లడాన్ని నిబంధనలు అనుమతించవని కూడా ఎస్పీ వివరించారు.

First Published:  16 July 2022 4:37 AM
Next Story