ప్రజారాజ్యమే నయం.. జనసేన పని అయిపోయినట్టేనా..?
వచ్చే ఎన్నికల వరకు జనసేనకు మనుగడ ఉంటుందా..? సీట్ల విషయంలోనే మొండిచేయి చూపించిన చంద్రబాబు జనసేనను ఏపీలో బలపడనిస్తారా..? పవన్ ఈ విషయాలన్నీ ఎందుకు ఆలోచించడంలేదనేదే జనసేన నేతల బాధ.
2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ గెల్చుకున్న అసెంబ్లీ సీట్లు 18. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో జనసేన పోటీ చేయబోతున్న అసెంబ్లీ సీట్లు కేవలం 24. వీటిలో ఓటమి గ్యారెంటీ అని చంద్రబాబు వదిలేసిన స్థానాలే ఎక్కువ. అంటే జనసేన పార్టీ గెలిచే సీట్ల సంఖ్య కచ్చితంగా ప్రజారాజ్యం కంటే తక్కువగానే ఉంటుందనమాట. పోనీ ఏపీ వరకే ఈ పోలిక పెట్టుకున్నా కూడా జనసేన మిగులుగా ఉంటుందని చెప్పలేం. ఈ పోలికతోనే ఇప్పుడు సోషల్ మీడియా పవన్ ని టార్గెట్ చేస్తోంది. ప్రజారాజ్యమే నయం అని అంటున్నారు జనసేన నేతలు. 2009లో చిరంజీవికి ఉన్న ధైర్యం 2024లో కూడా పవన్ కి లేకపోవడం శోచనీయం అని సెటైర్లు పేలుస్తున్నారు.
ఎందుకీ అవస్థ..?
హరిరామ జోగయ్య అయినా, మరొకరైనా.. జనసేన బాగుకోసమే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని అంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన టార్గెట్ పోటీ కాదు, వైసీపీ ఓటమి అని తేల్చి చెబుతున్నారు. ఇక్కడ వైసీపీ ఓటమి అంటే టీడీపీ-జనసేన కూటమి గెలుపు ఎంతమాత్రం కాదు, కేవలం టీడీపీ గెలుపు మాత్రమే. పోనీ ఏపీలో పవన్ ఆశించిన ఫలితం వచ్చినా దానివల్ల లాభం కేవలం టీడీపీకి మాత్రమే, జనసేనకు మాత్రం కాదు. ఈ లాజిక్ వదిలిపెట్టి పార్టీని పణంగా పెట్టి ఎన్నికలకు వెళ్తున్నారు పవన్ కల్యాణ్.
నమ్మేదెవరు..?
పోనీ ఫలితం పవన్ కల్యాణ్ ఊహించినట్టు లేదు అనుకుందాం, అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి..? వచ్చే ఎన్నికల వరకు జనసేనకు మనుగడ ఉంటుందా..? సీట్ల విషయంలోనే మొండిచేయి చూపించిన చంద్రబాబు జనసేనను ఏపీలో బలపడనిస్తారా..? పవన్ ఈ విషయాలన్నీ ఎందుకు ఆలోచించడంలేదనేదే జనసేన నేతల బాధ.
ఏపీలో జనసేన సొంతగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ సీఎం అయిపోవచ్చు కదా అంటూ వైసీపీ నేతలు చేస్తున్న వెటకారాన్ని కాసేపు పక్కనపెడదాం. ప్రత్యర్థి బలపడాలని కోరుకునేంత ఉదాత్తమైన నాయకులెవరూ రాజకీయాల్లో ఉండరు. కానీ మరీ 24 సీట్లతో పవన్ కల్యాణ్ లెక్క తేల్చేయడం మాత్రం ఇక్కడ జనసైనికులకు కూడా మింగుడు పడని వ్యవహారం. అప్పట్లో చిరంజీవి చేసిన ధైర్యం ఇప్పుడు పవన్ కల్యాణ్ చేస్తే కనీసం ప్రతిపక్షంగా అయినా బలపడొచ్చు కదా అనేది వారి వాదన. టీడీపీకి ఎలాగూ భవిష్యత్తు లేదు కాబట్టి.. రాబోయే రోజుల్లో జనసేన బలపడాలంటే 24సీట్ల బేరం కుదరదు అనేది వారి ఆవేదన. మరి దీన్ని పవన్ అర్థం చేసుకుంటారా..? తాను మాత్రమే గెలిస్తే చాలు అని సంకుచితంగా ఆలోచించి సరిపెట్టుకుంటారా..? వేచి చూడాలి.