Telugu Global
Andhra Pradesh

విద్యుత్ ఆఫీసుల్లో సెల్‌ఫోన్ ముచ్చట్లకు బ్రేక్..

ఆఫీసుకి రాగానే సెల్‌ఫోన్లు డిపాజిట్ చేసి రశీదు తీసుకోవాలి. తిరిగి భోజన విరామ సమయంలో మాత్రమే వారికి సెల్‌ఫోన్లు ఇస్తారు, భోజనం తర్వాత తిరిగి తీసుకుంటారు. ఆఫీస్ నుంచి వెళ్లిపోయేటప్పుడు ఉద్యోగులకు ఫోన్లు ఇచ్చేస్తారు.

విద్యుత్ ఆఫీసుల్లో సెల్‌ఫోన్ ముచ్చట్లకు బ్రేక్..
X

అదే పనిగా ఆఫీస్‌లో ఫోన్ చెవిలో పెట్టుకుని, లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతూ ఉండేవారిని మనం చూస్తూనే ఉంటాం. స్మార్ట్ ఫోన్లు వచ్చాక మాటలు తగ్గి చాటింగ్, వీడియోలు చూడటం ఎక్కువైంది. ఆఫీస్‌లో సెల్‌ఫోన్ ముచ్చట్లు మొదలైతే పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో సెల్‌ఫోన్ వాడకంపై పరిమితి ఉంటుంది. తొలిసారిగా ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(APCPDCL) ఉద్యోగుల సెల్‌ఫోన్లపై నిషేధం విధించింది. పనివేళల్లో ఉద్యోగులు సెల్‌ఫోన్ వాడకూడదని ఆదేశించారు ఉన్నతాధికారులు.

APCPDCL పరిధిలోని కార్యాలయాల్లో అక్టోబరు 1 నుంచి సెల్ ఫోన్ నిషేధం అమలులోకి రాబోతోంది. డిస్కం ఉద్యోగులు పని వేళ్లలో సమయాన్ని వృథా చేస్తున్నారని, రోజువారీ పనిని వాయిదా వేస్తున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు సంస్థ సీఎండీ పద్మాజనార్ధన్ రెడ్డి. ఉద్యోగుల పని గంటలు వృథా కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అత్యవసరం అయితే..

ఉదయాన్నే ఆఫీస్‌కి వచ్చే ఉద్యోగులు తమ సెల్‌ఫోన్లను ఒకచోట జమ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ టైమ్‌లో అత్యవసరం అయితే ఉన్నతాధికారులకు ఉద్యోగుల కుటుంబ సభ్యులు కాల్ చేయొచ్చు. అందరికీ తమ ఆఫీస్‌లోని ఉన్నతాధికారుల నెంబర్లు ఇవ్వాలని కేవలం అత్యవసర సమయాల్లోనే ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. ఫోన్లను పక్కనపెడితే ఉద్యోగులు పనిపై దృష్టిపెడతారని అంటున్నారు ఉన్నతాధికారులు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీసు సబార్డినేట్లు, రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీసుకి రాగానే సెల్‌ఫోన్లు డిపాజిట్ చేసి రశీదు తీసుకోవాలి. తిరిగి భోజన విరామ సమయంలో మాత్రమే వారికి సెల్‌ఫోన్ ఇస్తారు, భోజనం తర్వాత తిరిగి తీసుకుని ఆఫీస్ నుంచి వెళ్లిపోయేటప్పుడు ఉద్యోగులకు ఫోన్లు ఇచ్చేస్తారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.

First Published:  27 Sept 2022 2:27 PM IST
Next Story