ఏపీలో పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపు
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను కౌంటింగ్ రోజయిన వచ్చే నెల మూడు వరకు పొడిగించాలన్న డిమాండ్‌ను మీనా కొట్టిపారేశారు. అది సాధ్యం కాదని చెప్పారు.
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ గడువును మరోరోజు పొడిగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా ప్రకటించారు. కొన్ని చోట్ల పోస్టల్ ఓటు వేయడానికి అవసరమైన 12 డీ-ఫారంలు అందడంలో ఆలస్యమైందన్నారు. ఇప్పటి దాకా ఓటేయని వారు ఈ రోజు, రేపు కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు. సెక్యూరిటీ డ్యూటీకి వెళ్లినవారు ఈనెల 9 వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చన్నారు.
వచ్చే నెల 3 వరకు పొడిగించలేం..
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను కౌంటింగ్ రోజయిన వచ్చే నెల మూడు వరకు పొడిగించాలన్న డిమాండ్‌ను మీనా కొట్టిపారేశారు. అది సాధ్యం కాదని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ వేసేవారు తమ సొంత నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ సెంటర్లలో కూడా ఓటేయవచ్చని ఆయన సూచించారు.
ప్రలోభాలున్నాయి.. దృష్టి పెడుతున్నాం
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లోనూ ప్రలోభాలు జరుగుతున్నాయి. దీనిపై దృష్టి సారించాం. ఓటింగ్ కేంద్రాల వద్ద కూడా డబ్బులిచ్చి ఓట్లేయించుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది అని ముకేష్‌కుమార్ మీనా వెల్లడించారు. ఒంగోలులో ఇలాంటి ప్రలోభాలు జరిగినట్లు గుర్తించాం. కొంతమంది ఓటేశాక డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా కూడా డబ్బులిస్తున్నట్లు తెలిసిందన్నారు. పల్నాడులో ఏకంగా హోలోగ్రామ్ పెట్టి మరీ డబ్బులు పంచుతున్నట్లు తెలిసిందన్నారు.