Telugu Global
Andhra Pradesh

నంది అవార్డులను కులాల వారీగా పంచుకునేవారు.. పోసాని సంచలన వ్యాఖ్యలు

టెంపర్ సినిమాలో నటించినందుకు తనకు కర్మకాలి నంది అవార్డు ఇచ్చారని చెప్పారు. ఆ సినిమాలో తాను బాగా నటించడంతో గత్యంతరం లేని పరిస్థితిలో తనకు అవార్డు ఇచ్చారన్నారు.

నంది అవార్డులను కులాల వారీగా పంచుకునేవారు.. పోసాని సంచలన వ్యాఖ్యలు
X

నటుడు, దర్శకుడు, ఏపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ పోసాని కృష్ణ మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందజేసే నంది అవార్డులను గ్రూపులు, కులాలవారీగా పంచుకునే వారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అవార్డుల పంపకాలు ఇలాగే జరిగేవని ఆరోపణలు చేశారు. పోసాని చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దుమారం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఏపీ ఫైబర్ నెట్ 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పోసాని కృష్ణ మురళి పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ఫైబర్ నెట్ లో సినిమాలు చూసే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు.

టెంపర్ సినిమాలో నటించినందుకు తనకు కర్మకాలి నంది అవార్డు ఇచ్చారని చెప్పారు. ఆ సినిమాలో తాను బాగా నటించడంతో గత్యంతరం లేని పరిస్థితిలో తనకు అవార్డు ఇచ్చారన్నారు. తాను కూడా నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై అవార్డు అందుకున్నానని చెప్పారు.

ఆ సమయంలో ఎవరెవరికి ఏ అవార్డులు ఇచ్చారో గమనించినట్లు తెలిపారు. అవార్డుల కమిటీలో 11 మంది ఒక వర్గం వారే ఉన్నట్లు గుర్తించానని చెప్పారు. అవార్డులను గ్రూపులు, కులాలవారీగా పంచుకున్నట్లు అర్థమై తనకు వచ్చిన అవార్డును కూడా వద్దని చెప్పినట్లు తెలిపారు. అవార్డులను కులాలు, మతాలకు అతీతంగా అందించాలని పోసాని పేర్కొన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీని డబ్బు శాసిస్తోందని చెప్పారు.

కాగా, పోసాని చేసిన వ్యాఖ్యలను ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ఖండించారు. నంది అవార్డుల పంపకంపై పోసాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమం కాబట్టి.. పార్టీ పరంగా ఆయన మాట్లాడి ఉండవచ్చన్నారు. నంది అవార్డుల ఎంపిక ఎంతో పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. టెంపర్ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డు వచ్చిందని.. కులం, మతం చూసి అవార్డు ఇవ్వలేదన్నారు.

ఆయనకు నంది అవార్డు వచ్చిన సమయంలో అవార్డు ఎంపిక కమిటీలో జీవిత రాజశేఖర్, పరుచూరి బ్రదర్స్ వంటి వారు ఉన్నారని తెలిపారు. వాళ్లు అసలు కులాన్ని పరిగణనలోకి తీసుకునే వ్యక్తులు కాదని చెప్పారు. ఏది ఏమైనా నంది అవార్డులపై పోసాని కృష్ణమురళి చేసిన ఆరోపణలు సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని సృష్టించాయి. కాగా, గతంలో ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటన చేసినవారికి ఏటా నంది అవార్డులు ఇచ్చేవారు. అయితే కొన్నేళ్లుగా నంది అవార్డుల ప్ర‌దానం ఆగిపోయింది.

First Published:  7 April 2023 7:18 PM IST
Next Story