భయపడొద్దు.. ఆ నీచులపై తిరగబడండి.. - గీతాంజలి ఘటనపై పోసాని
రాష్ట్రంలో బూతు పదజాలం, వ్యక్తిత్వ హననం వంటి వికృత చర్యలకు టీడీపీ అధినేత చంద్రబాబే ఆద్యుడని పోసాని మండిపడ్డారు. ప్రధాని మోడీని సైతం గతంలో చంద్రబాబు తూలనాడారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
డబ్బు మదంతో చంద్రబాబు ఐ-టీడీపీ సోషల్ మీడియాను నడిపిస్తూ ఎంతోమంది మహిళల వ్యక్తిత్వంపై దారుణంగా దాడి చేశాడని, ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగానే గీతాంజలి బలైపోయిందని ఏపీ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కి పాల్పడే నీచులకు మహిళలు భయపడొద్దని.. ఆ నీచులపై తిరగబడాలని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో బూతు పదజాలం, వ్యక్తిత్వ హననం వంటి వికృత చర్యలకు టీడీపీ అధినేత చంద్రబాబే ఆద్యుడని పోసాని మండిపడ్డారు. ప్రధాని మోడీని సైతం గతంలో చంద్రబాబు తూలనాడారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు అవినీతిపరుడంటూ గతంలో మోడీ విమర్శించారని, పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారని బహిరంగ సభలో ఆరోపించారని తెలిపారు. అంతే.. వెంటనే చంద్రబాబు మోడీ కుటుంబంపై దాడికి దిగారని, మోడీ భార్యను వదిలేశారని, ఆయనకు కొడుకులు లేరని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని గుర్తుచేశారు. చంద్రబాబును ఎవరైనా విమర్శిస్తే వెంటనే వాళ్ల కుటుంబ సభ్యులపై వ్యక్తిత్వ హననం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఎల్లో, సైకో అభిమానుల సోషల్ మీడియా మెసేజ్‌లకు మహిళలు భయపడాల్సిన అవసరం లేదని పోసాని చెప్పారు. ఆత్మస్థైర్యంతో ఎదురుదాడి చేస్తే వాళ్లకే కన్నీళ్లు వస్తాయని ఆయన తెలిపారు. వలంటీర్లు మానవ అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పిన నీచులపై సమాజం తిరగబడాలన్నారు. బ్రాహ్మణి, భువనేశ్వరిలకు తమ భర్తలు చేస్తున్న నీచత్వాన్ని గురించి మహిళలే రోడ్లపైకి వచ్చి చెప్పాలన్నారు. ఇక.. ప్రధాని మోడీని దూషించి, అమిత్ షాపై రాళ్ల దాడి చేయించిన చంద్రబాబుతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పోసాని చెప్పారు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీ కోసం చంద్రబాబు పంచన చేరి సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకోవడం దారుణమన్నారు.