Telugu Global
Andhra Pradesh

కేసులు వేసి, కోర్టుకి పిలిచి, నన్ను చంపేస్తారు -పోసాని

అసలు లోకేష్‌ ఎవరిపైనా విమర్శలు చేయలేదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన లోకేష్‌పై.. పరువు నష్టం దావా వేయకూడదా? అన్నారు. లోకేష్ పై కేసు వేస్తే 20 ఏళ్ల వరకు బయటకు రారని అన్నారు పోసాని.

కేసులు వేసి, కోర్టుకి పిలిచి, నన్ను చంపేస్తారు -పోసాని
X

ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళిపై నారా లోకేష్ పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణలో భాగంగా ఇటీవల పలుమార్లు లోకేష్ మంగళగిరి కోర్టుకి వెళ్లారు. తనపై పోసాని చేసిన ఆరోపణలు రుజువు చేయలేకపోతున్నారని, ఆయన కనీసం నోటీసులు కూడా తీసుకోవడంలేదని విమర్శించారు. ఈ విమర్శలకు ఈరోజు సుదీర్ఘ కౌంటర్ ఇచ్చారు పోసాని. కావాలనే నారా లోకేష్ తనపై కేసులు పెట్టారని అన్నారు. తనను చంపాలని నారా లోకేష్‌ కుట్ర పన్నుతున్నారని చెప్పారు. మంగళగిరి కోర్టుల చుట్టూ తనను తిప్పాలని, అలా కోర్టులకి వెళ్లినప్పుడు తనను చంపాలని ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ తాను చనిపోతే దానికి లోకేష్‌ దే బాధ్యత అన్నారు. చావుకు తాను భయపడబోనని చెప్పారు.

నేనేం చెప్పానంటే..?

కంతేరులో 14 ఎకరాలు కొన్నారని నారా లోకేష్ పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రూ.4కోట్లకు ఆ కేసు వేశారు లోకేష్. అయితే తాను అన్నదాంట్లో తప్పేమీ లేదంటున్నారు పోసాని. అల్‌ ఖైదా పేరు చెబితే బిన్ లాడెన్ గుర్తుకు వచ్చినట్టు హెరిటేజ్ అంటే చంద్రబాబు గుర్తుకు రాడా? అని ప్రశ్నించారు పోసాని. హెరిటేజ్ ఆస్తులు లోకేష్ వి కావా? అని అడిగారు. కంతేరులో హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్న‌మాట నిజం‌కాదా? అన్నారు. అసలు లోకేష్‌ ఎవరిపైనా విమర్శలు చేయలేదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన లోకేష్‌పై.. పరువు నష్టం దావా వేయకూడదా? అన్నారు. లోకేష్ పై కేసు వేస్తే 20 ఏళ్ల వరకు బయటకు రారని అన్నారు పోసాని.


జగ్ ని తిట్టిన వీడియోలు మళ్లీ మళ్లీ..

పోసాని చేసిన ఆరోపణలు నిజమా, కావా, తప్పుడు ఆరోపణలు అయితే పర్యవసానాలేంటి అనేది కోర్టు తేలుస్తుంది. కోర్టు నోటీసులిస్తే తీసుకోకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ కూడా తిట్టారు కదా, ఆయనపై కేసులు పెట్టకూడదా అని పోసాని లాజిక్ తీయడం కాస్త వింతగా తోస్తోంది. లోకేష్ పై కేసు పెట్టొద్దని ఎవరూ పోసానిని బతిమిలాడలేదు. పోనీ కేసులు పెట్టకుండా ఎవరూ అడ్డుపడనూ లేదు. పెడితే కేసు పెట్టాలి, లేదా.. లోకేష్ కేసుని కోర్టులో తేల్చుకోవాలి. ఈ రెండూ చేయకుండా పోసాని ప్రెస్ మీట్ పెట్టి, వాళ్లు తిట్టారు, వీళ్లు తిట్టారు అంటూ మరోసారి పాత వీడియోలు చూపించడం విశేషం.

అమరావతి రైతులకు పోసాని ఆఫర్..

పెద కాకానిలో తనకు కోట్ల రూపాయల విలువైన ఏడు ఇళ్ల స్థలాలు ఉన్నాయని, వాటన్నిటినీ తాను పేదలకు పంచి పెట్టడానికి రెడీగా ఉన్నానని చెప్పారు పోసాని. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా రైతులు అడ్డుపడుతున్నారని.. తన స్థలాలు పేదలకు పంచి పెడితే, కోర్టు కేసులనుంచి అమరావతి రైతులు తప్పుకుంటారా అని ప్రశ్నించారు.

First Published:  22 Aug 2023 5:59 PM IST
Next Story