Telugu Global
Andhra Pradesh

నన్ను చంపేస్తారు, కాపాడండి.. డీజీపీకి పోసాని ఫిర్యాదు

తన హత్యకు కుట్ర పన్నారని తనకు సమాచారం ఉందని, ఎవరైనా ముందుగా చెప్పి హత్య చేయరు కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు పోసాని కృష్ణ మురళి. గతంలో చంద్రబాబు కూడా ఎన్టీఆర్ కి చెప్పే వెన్నుపోటు పొడిచారా అన్నారు.

నన్ను చంపేస్తారు, కాపాడండి.. డీజీపీకి పోసాని ఫిర్యాదు
X

"నన్ను టీడీపీలో చేరాలని ఒత్తిడి చేశారు. లోకేష్ పీఏ చైతన్య ఫోన్ చేసి మరీ టీడీపీలో చేరాలని చెప్పారు. నేను కుదరదన్నాను. అందుకే నాపై కక్షకట్టారు. నన్ను హత్య చేయడానికి కుట్రపన్నారు. పోలీసులు నాకు రక్షణ కల్పించాలి." అంటూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఏపీ ఫిల్మ్ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి. నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని పోసాని కంప్లయింట్ ఇచ్చారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్నట్టు సమాచారం ఉందన్నారు.

చెప్పి చంపేస్తారా..?

తన హత్యకు కుట్ర పన్నారని తనకు సమాచారం ఉందని, ఎవరైనా ముందుగా చెప్పి హత్య చేయరు కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు పోసాని కృష్ణ మురళి. గతంలో చంద్రబాబు కూడా ఎన్టీఆర్ కి చెప్పే వెన్నుపోటు పొడిచారా అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి వద్దు, ప్రజలే ముఖ్యమని కాంగ్రెస్‌ లో ఉన్నపుడు చంద్రబాబు చెప్పారని.. కానీ కాంగ్రెస్ ఓడిపోగానే టీడీపీలో చేరి, ఎన్టీఆర్ పక్కన సెటిలయ్యారని గుర్తు చేశారు. తర్వాత అదే ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు.

ఎంతమంది బట్టలూడదీస్తావ్..

గన్నవరం మీటింగ్ లో మాజీ మంత్రి కొడాలి నానిపై లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు పోసాని కృష్ణ మురళి. లోకేష్ అందరినీ బట్టలు విప్పి కొడతా అంటున్నారని.. ఆయన ఎన్నిసార్లు, ఎంతమంది బట్టలూడ దీస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో అది చెప్పాలని నిలదీశారు పోసాని.

కాపు ఓట్లకోసం డ్రామా..

కాపుల ఓట్ల కోసం చంద్రబాబు, లోకేష్​ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు పోసాని. కాపులకు అన్యాయం చేసింది టీడీపీనే అని విమర్శించారు. చంద్రబాబుకు సీఎం పదవి ఇష్టం లేకపోతే పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రమాణం చేయాలన్నారు. తాను అగ్రెసివ్‌ గా మాట్లాడతాను కాబట్టే లోకేష్ కి టార్గెట్ అయ్యానని, అందుకే తనను చంపాలనుకుంటున్నారని చెప్పారు పోసాని.

First Published:  23 Aug 2023 2:43 PM IST
Next Story