నెల్లూరు రెడ్డి గార్లకి ఆరో``సారీ``తప్పదా?
వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై సోమిరెడ్డి స్పందిస్తూ.. ఏ పార్టీలో ఉన్నామూడు పదవులు అలవాటైన ఆదాల.. పెళ్లి పీటల మీదనుంచి లేచిపోవడం, శోభనం గదిలోంచి పారిపోవడమో చేస్తారని పార్టీల మార్పుపై వ్యంగ్యంగా ఎత్తిపొడిచారు.
నెల్లూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పొలిటికల్ హీట్ పెంచేసింది. బహిరంగ సభలలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలపై లోకేష్ అవినీతి ఆరోపణలు చేయడం, వాటిని వైసీపీ ఎమ్మెల్యేలు ఖండించడం రొటీన్ అయిపోయింది. నెల్లూరు రాజకీయాలు చాలా విభిన్నం. అందరూ బద్ధశత్రువుల్లా కనిపిస్తారు. వైరి రాజకీయపక్షాల్లో ఉంటారు. అందరూ దగ్గర బంధువులే. విమర్శలు-ప్రతివిమర్శలు పెద్దగా ఉండవు. ఈ సాంప్రదాయ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్‌కి ఒక్కసారిగా అడ్డుకట్ట వేశారు లోకేష్. యువగళం నెల్లూరులో అడుగుపెట్టిన నుంచీ ఇటు టీడీపీ నేతలకి, అటు వైసీపీ నేతలకి నోటి నిండా పని కల్పించారు.
టీడీపీలో చేరాలని చాలా మంది చూస్తున్నారని, ఎన్నికలకు ముందు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేరొచ్చని మాజీ మంత్రి సోమిరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయనకి అది అలవాటేనని, అధికార పార్టీలో అన్నీ చక్కబెట్టుకుని రావడం అంటూ చమత్కరించారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమిరెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పటివరకూ ఐదు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి ఆరో సారీ ఓడిపోవడానికి సిద్ధమవుతున్నాడని ఆదాల మండిపడ్డారు.
వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై సోమిరెడ్డి స్పందిస్తూ.. ఏ పార్టీలో ఉన్నామూడు పదవులు అలవాటైన ఆదాల.. పెళ్లి పీటల మీదనుంచి లేచిపోవడం, శోభనం గదిలోంచి పారిపోవడమో చేస్తారని పార్టీల మార్పుపై వ్యంగ్యంగా ఎత్తిపొడిచారు. తాను ఆరోసారి ఓడిపోతానేమో తెలియదు కానీ.. ఆదాల ఆరోసారి పార్టీ మారడం ఖాయం అని చెప్పుకొచ్చారు. మొదట కాంగ్రెస్, 1999లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2014 టీడీపీ, 2019 వైసీపీలో చేరిన ఆదాల ఆరోసారి 2024లోగా పార్టీ మారడం తధ్యమన్నారు. ఎన్నికలకి ముందుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి సొంత టీముతో సర్వే చేయించుకుంటారని, అధికారం వచ్చే పార్టీలోకి దూకడం ఆయనకి అలవాటేనని దుయ్యబట్టారు. నెల్లూరు టీడీపీ-వైసీపీ నేతల పరస్పర ఆరోపణలు చూస్తుంటే.. ఇద్దరు కీలక నేతలకి ఆరోసారి రికార్డు తప్పేలా లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారి ఓడిపోతే ఆదాల చెప్పినట్టు ఆరోసారి ఓటమి అవుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈసారి పార్టీ మారితే సోమిరెడ్డి అన్నట్టు ఆరోసారి పార్టీ మారినవారిగా రికార్డు నెలకొల్పుతారు.