ముద్దు కృష్ణమ కుమారుల పొలిటికల్ వార్
జగదీష్ గళమెత్తారు. ఈసారి పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. అంతేకాదు టీడీపీ అయినా, వైసీపీ అయినా సరే అని ప్రకటించారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో లేను అంటూనే టీడీపీ నగరి టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్నారు.
మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబంలో మళ్లీ వారసత్వపోరు మొదలైంది. ముద్దు కృష్ణమ నాయుడు మరణం తర్వాత తొలిరోజుల్లోనే పెద్ద కుమారుడు భాను ప్రకాశ్, చిన్న కుమారుడు జగదీష్ మధ్య వార్ నడిచింది. 2019 ఎన్నికల్లో మాత్రం పెద్ద కుమారుడు భానుకే టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయన నగరి నుంచి పోటీచేసి రోజా చేతిలో ఓడిపోయారు. 2019లో పోటీకి చిన్నకుమారుడు జగదీష్ కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. కానీ, పార్టీ నాయకత్వం సహకరించకపోవడంతో మౌనంగా ఉండిపోయారు.
ఇప్పుడు జగదీష్ గళమెత్తారు. ఈసారి పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. అంతేకాదు టీడీపీ అయినా, వైసీపీ అయినా సరే అని ప్రకటించారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో లేను అంటూనే టీడీపీ నగరి టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటున్నారు. అదీ సాధ్యం కాకపోతే చంద్రగిరి టికెట్ ఇచ్చినా తనకు ఓకే అంటున్నారు. ఒకవేళ టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా పోటీకి సిద్ధమని ప్రకటించారు. వైసీపీ కీలక నేతల నుంచి ఆఫర్లు వస్తున్నాయా.. అన్న దానిపై స్పందించిన జగదీష్, ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో లేనని, తటస్థంగా ఉన్నానని చెప్పారు. తన అనుచరులతో చర్చించి ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పోటీ విషయంలో తన తొలి ప్రాధాన్యత మాత్రం నగరి నియోజకవర్గమేనని, అక్కడ పార్టీలకు అతీతంగా తన తండ్రి అభిమానులు తనను ఆహ్వానిస్తున్నారని జగదీష్ చెప్పారు. అక్కడ పోటీ సాధ్యం కానీ పక్షంలో చంద్రగిరిలో పోటీకి తాను సిద్ధమన్నారు.
టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా పోటీలో ఉండటం మాత్రం ఖాయమని ప్రకటించారు. సొంత అన్నపై పోటీకి సిద్ధమేనా అని ప్రశ్నించగా.. ఆ రోజు తాను ఏ పార్టీలోఉంటానో ఆ పార్టీ నాయకత్వం ఆదేశిస్తే పోటీ చేస్తానని చెప్పారు. మొత్తం మీద జగదీష్ టీడీపీకి పరోక్ష సంకేతాలు ఇస్తున్నట్టుగా ఉంది. నగరి టికెట్ ఇస్తే పోటీ చేస్తా.. లేదంటే చంద్రగిరి టికెట్ ఇచ్చినా ఓకే.. ఏదీ లేదు అంటే మాత్రం తాను వైసీపీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమని సంకేతాలిస్తున్నారు.
*