Telugu Global
Andhra Pradesh

రాజమండ్రి జైలులో రాజకీయాలు.. ములాఖత్ లో టీడీపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్

పలువురు కీలక నేతలకు కూడా ములాఖత్ కి అవకాశం ఇవ్వని చంద్రబాబు, జ్ఞానేశ్వర్ ని కలవాలనుకోవడం కచ్చితంగా లిస్ట్ ఫైనల్ చేయడానికేనంటున్నారు.

రాజమండ్రి జైలులో రాజకీయాలు.. ములాఖత్ లో టీడీపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్
X

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఓవైపు డీహైడ్రేషన్ తో బాధపడుతున్న చంద్రబాబు మరోవైపు రాజకీయ నిర్ణయాలు తీసుకోడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థుల లిస్ట్ రాజమండ్రి జైలులోనే ఫైనల్ చేశారట. దీనికోసం చంద్రబాబుతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయినట్టు సమాచారం. నారా లోకేష్, భువనేశ్వరితోపాటు.. కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఈరోజు రాజమండ్రి జైలుకి వచ్చి చంద్రబాబుని కలిశారు. భేటీ అనంతరం రాజకీయాలను మాత్రం వారు ప్రస్తావించలేదు. చంద్రబాబుని జైలులో చూస్తే చాలా బాధ వేసిందని చెప్పారు జ్ఞానేశ్వర్.

పోటీకి సై..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేస్తుందనే సంకేతాలు కనపడుతున్నాయి. ఓ దశలో పోటీ వద్దని అనుకున్నా.. తర్వాత బాలకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో చంద్రబాబుకోసం జరుగుతున్న నిరసనల గురించి టీడీపీ కాస్త ఎక్కువగా ఊహించుకున్నట్టు అర్థమవుతోంది. అందుకే పోటీకి జాబితా తయారు చేసిన జ్ఞానేశ్వర్, ఆ లిస్ట్ తీసుకుని రాజమండ్రి జైలుకి వెళ్లారు.

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పోటీలో ఉంటుందనే ప్రచారం ఉంది. పోనీ బీజేపీ కలవకపోయినా, టీడీపీ-జనసేన కూటమి పోటీ మాత్రం ఖాయం. అయితే తెలంగాణలో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తాయా, లేక ఏ రెండయినా కూటమి కడతాయా అనేది మాత్రం తేలడంలేదు. ఇప్పటికే జనసేన పోటిచేసే నియోజకవర్గాలను ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచింది. ఇప్పుడు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ అభ్యర్థుల లిస్ట్ ని చంద్రబాబు ఆమోదం కోసం తీసుకెళ్లారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. పలువురు కీలక నేతలకు కూడా ములాఖత్ కి అవకాశం ఇవ్వని చంద్రబాబు జ్ఞానేశ్వర్ ని కలవాలనుకోవడం కచ్చితంగా లిస్ట్ ఫైనల్ చేయడానికేనంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యంపై హడావిడి జరుగుతున్న నేపథ్యంలో ఈ లిస్ట్ బయటకు వస్తే ఆ విషయం డైవర్ట్ అవుతుందని టీడీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే.

First Published:  14 Oct 2023 11:48 AM GMT
Next Story