Telugu Global
Andhra Pradesh

ఈనెల 9న ఏపీలో పొలిటికల్ హీట్.. ఎందుకంటే..?

మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈనెల 9న కీలక సమావేశం పెట్టుకున్నాయి. ఈనెల 9న టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం జరగబోతోంది.

ఈనెల 9న ఏపీలో పొలిటికల్ హీట్.. ఎందుకంటే..?
X

ఏపీలో ఈనెల 9న పొలిటికల్ హీట్ పెరిగే అంచనాలున్నాయి. అదే రోజు అధికార పార్టీ 'వై ఏపీ నీడ్స్ జగన్' అనే కార్యక్రమం మొదలు పెడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారు జగన్. ఎన్నికల నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఆయన ఆలోచన. గతంలో మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు అంటూ జరిగిన కార్యక్రమాలకు ఇది కొనసాగింపు. మరోసారి ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని ప్రజలకు వివరించడంతోపాటు, జగన్ ని సీఎం ని చేసుకోవాల్సిన ఆవశ్యకతను వారికి తెలియజెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే గడప గడపకు కార్యక్రమంతో జనంలోకి వెళ్తున్న నేతలు.. 'వై ఏపీ నీడ్స్ జగన్'తో మరోసారి బిజీగా మారబోతున్నారనమాట.

ప్రతిపక్షాలకి కూడా అదే ముహూర్తం..

మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈనెల 9న కీలక సమావేశం పెట్టుకున్నాయి. ఈనెల 9న టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి ఈ రోజే కీలక ప్రకటన వెలువడింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున లోకేష్, అచ్చెన్నాయుడు, జనసేన తరపున పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌.. మొత్తంగా 10మంది నేతలు హాజరవుతారు. అక్టోబర్ 23న రాజమండ్రిలోని మంజీర హోటల్‌ లో టీడీపీ-జనసేన తొలి సమన్వయ సమావేశం జరుగగా, ఇది రెండోది.

మేనిఫెస్టోపై చర్చ..

ఇటీవలే పవన్ కల్యాణ్, హైదరాబాద్ లో చంద్రబాబుని కలసి వచ్చారు. ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే మీటింగ్ కి ఆయన హాజరవుతారు. ఈ మీటింగ్ లో మేనిఫెస్టోపై చర్చ జరిగే అవకాశముంది. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పై కూడా చర్చిస్తారు. ఈ సమావేశం తర్వాత రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లే అవకాశముంది. మరోవైపు సీట్ల వ్యవహారంలో కూడా చర్చలు మొదలైనట్టే అనుకోవాలి. ఎన్నికల నాటికి హడావిడిపడకుండా.. ఇప్పుడే అభ్యర్థులను ఖరారు చేసుకుంటే మంచిదని ఇరు పార్టీల నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కూడా ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశముంది.

మొత్తమ్మీద ఇటు అధికార పార్టీ కీలక కార్యక్రమాన్ని ఈ నెల 9న మొదలు పెడుతోంది, అటు ప్రతిపక్షాలు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆ రోజు ఏపీలో పొలిటికల్ హీట్ కి ఇవే కారణాలు.


First Published:  6 Nov 2023 10:46 AM GMT
Next Story