Telugu Global
Andhra Pradesh

ఏపీలో పొలిటికల్ హీట్.. కీలక నేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సమావేశం

ఏపీలో కాపు సామాజికవర్గం బీఆర్ఎస్ వైపు చూస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియామకం తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు మరింతమంది కీలక నేతల్ని బీఆర్ఎస్ ఆకర్షిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపీలో పొలిటికల్ హీట్.. కీలక నేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సమావేశం
X

ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ అలజడి సృష్టించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే జనసేన నుంచి కీలక నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంపై బీఆర్ఎస్ ఫోకస్ చేసిందని అంటున్నారు. ఈ ప్రచారాన్ని బలపరిచేలా ఉన్న తాజా సంఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరింత కాక రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కలవడం సంచలనంగా మారింది. ఇది ప్రైవేట్ మీటింగ్ అని అంటున్నా వారితో రాజకీయాలు, చేరికల విషయంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ బీఆర్ఎస్ లో చేరితే 2024 ఎన్నికల్లో కచ్చితంగా ఆ పార్టీ ఏపీలో అలజడి సృష్టించడం ఖాయం.

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనిల్ వివాహ విందులో పాల్గొనేందుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద వైజాగ్ వచ్చారు. ఆ తర్వాత ఆయన గంటా శ్రీనివాసరావు, జేడీ లక్ష్మీనారాయణతో కలిశారు. టీకోసం ఆహ్వానిస్తే ఆయన వచ్చారని, అది రాజకీయ భేటీ కాదని అంటున్నారు నేతలు. కానీ చాయ్ పే చర్చ వెనక చాలా తతంగం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో కాపు సామాజికవర్గం బీఆర్ఎస్ వైపు చూస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియామకం తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు మరింతమంది కీలక నేతల్ని బీఆర్ఎస్ ఆకర్షిస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు గాలమేస్తోంది. గంటా, జేడీ త్వరలో బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది.

టీడీపీలో ఉన్నా, జనసేనలో ఉన్నా ఎన్నికల సమయంలో సీట్ల విషయంలో తకరారు ఖాయం. పొత్తుల ఇబ్బందులు ఉండనే ఉంటాయి. కానీ బీఆర్ఎస్ లో అలాంటి ఇబ్బందులుండవు. జెండా, అజెండా, పోటీచేయబోయే సీటు విషయంలో అందరికీ క్లారిటీ ఉంటుంది. నామినేటెడ్ పోస్ట్ ల విషయంలో కూడా నేతలకు బీఆర్ఎస్ పై నమ్మకం ఉంది. అందుకే చాలామంది కేసీఆర్ వెంట నడవాలనుకుంటున్నారు.

జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ చక్రం తిప్పాలనుకుంటోంది. ముందుగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో బలం పెంచుకోడానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటకలో కండువాల పండగ జరుగుతోంది. అయితే ఏపీ విషయంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఏపీకి పార్టీ అధ్యక్షుడిని నియమించి ముందుగానే ఇక్కడ పని మొదలు పెట్టారు. దీని ఫలితం ఎలా ఉంటుందో ముందు ముందు తేలిపోతుంది.

First Published:  3 Feb 2023 7:02 AM IST
Next Story