Telugu Global
Andhra Pradesh

ఇంత ఓవరాక్షన్ పోలీసులకు అవసరమా?

లోకేష్ కాన్వాయ్ వివరాలు, రూట్ మ్యాప్ ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అంతేకానీ లోకేష్ ఎవరెవరిని కలుస్తారు? లోకేష్‌ను ఎవరొచ్చి కలుస్తారో ఎలా చెప్పగలమని వర్ల డీజీపీని నిలదీశారు.

ఇంత ఓవరాక్షన్ పోలీసులకు అవసరమా?
X

పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉన్నారు. ప్రజాస్వామికంగా వివిధ రాజకీయపార్టీలకున్న హక్కులను కూడా హరించేస్తున్నారు. నారా లోకేష్ చేయాలని అనుకుంటున్న పాదయాత్ర విషయంలో పోలీసుల స్పందనే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. కుప్పం నుండి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయాలని లోకేష్ డిసైడ్ అయ్యారు. ఇందుకు అవసరమైన అనుమతులు కావాలంటు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. 9వ తేదీన దరఖాస్తు చేస్తే ఇప్పటివరకు అనుమతివ్వలేదు పోలీసులు.

అనుమతివ్వకపోగా విచిత్రమైన ప్రశ్నలు వేశారు. పాదయాత్రలో భాగంగా లోకేష్ ఎవరెవరిని కలుస్తారు? లోకేష్‌ను ఎవరెవరు కలుస్తారు? లోకేష్‌తో పాటు యాత్రలో పాల్గొనేవాళ్ళ ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్, పాన్‌ కార్డుల సమాచారం కావాలని అడిగినట్లు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. లోకేష్ కాన్వాయ్ వివరాలు, రూట్ మ్యాప్ ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అంతేకానీ లోకేష్ ఎవరెవరిని కలుస్తారు? లోకేష్‌ను ఎవరొచ్చి కలుస్తారో ఎలా చెప్పగలమని వర్ల డీజీపీని నిలదీశారు.

లోకేష్‌తో పాటు యాత్రలో పాల్గొనే వాళ్ళ ఆదాయ ధృవీకరణ పత్రాలు, పాన్‌ కార్డు, ఆధార్ కార్డులతో పోలీసులకు ఏం ప‌ని? పాదయాత్రలో లోకేష్‌ను కలిసే వాళ్ళ వివరాలను సేకరించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ శాఖదే. లోకేష్ పాదయాత్రలో ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా కలిసే ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు భేటీల వివరాలను సేకరించి ప్రభుత్వానికి అందచేయటం వాళ్ళ బాధ్యత. ఇప్పుడే కాదు గతంలో వైఎస్సార్, చంద్రబాబు, జగన్ పాదయాత్రల సందర్భాల్లో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కలిసిపోయుండేవి.

ఎప్పుడో జరిగే భేటీల వివరాలను ఇప్పుడే ఇవ్వమని అడగటమంటే ఓవర్ యాక్షన్ కిందే లెక్క. ఒకవైపు తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించటం తప్పని విజయమ్మ గోల చేస్తున్నారు. మరదే పనిని ఏపీలో లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించటాన్ని ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుంది? ఇలాంటి పనికిమాలిన పనులు చేసే లోకేష్ పాదయాత్రను ప్రభుత్వమే బాగా పాపులర్ చేస్తోంది.

First Published:  23 Jan 2023 12:18 PM IST
Next Story