సాయంత్రం 4 గంటల్లోగా విశాఖ నుంచి వెళ్ళిపోవాలి... పవన్ కు పోలీసుల ఆదేశం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సాయంత్రం 4 గంటల లోపు విశాఖపట్నం వదిలి పోవాలని పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన కీలక నేతలకు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు.
నిన్నటి నుంచి విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల కోసం అధికార వైసీపీ మద్దతుతో ఉత్తరాంధ్ర జేఏసీ విశాఖ గర్జన, అమరావతి మాత్రమే రాజధాని కావాలంటూ తెలుగుదేశం పార్టీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ , మరో వైపు జనసేన అధినేత పవన కళ్యాణ్ పర్యటన...ఈ కార్యక్రమాల నేపథ్యంలో నిన్న మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తల దాడి చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు అనేక మంది జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారు.
ఈ క్రమంలో ఈ రోజు పోలీసులు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన కీలక నేతలకు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల్లోగా విశాఖపట్నాన్ని వీడాలని నోటీసుల్లో పవన్ తో పాటు జనసేన నేతలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ నోటీసులు తీసుకోవడానికి జనసేన నేతలు తిరస్కరించారు. ఈ విషయంలో పోలీసులకు జనసేన నాయకులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. చివరకు పోలీసులు పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడారు. నగరంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని ఆయనకు తెలిపారు. అందువల్ల శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నామని ఆయనకు చెప్పారు. అయితే పోలీసుల ఆదేశాలకు తలవంచి పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి వెళ్ళిపోతారా లేదా అనేది ఇంకా తేలలేదు.