అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు.. పోలీసు సంఘం వార్నింగ్
తనకు చంద్రబాబు హోంశాఖ అప్పగిస్తే.. ఇప్పుడు ఏ పోలీసులైతే దౌర్జన్యం చేస్తున్నారో ఆ నాకొడుకుల పేర్లన్నీ రాసుకుని వారి అంతు చూస్తా అంటూ హెచ్చరించారు.
ఏపీలో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసేందుకు వివిధ పార్టీల్లోని కొందరు నేతలు మాత్రమే కారణమవుతున్నారు. అలాంటి వారిలో టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ముందుంటున్నారు. ఆయన నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తున్నారు. మహిళల పట్ల గౌరవం కూడా ఆయన మాటల్లో కనిపించదు. మహిళా మంత్రులను బహిరంగంగానే చంకనాకడానికి ఉన్నారా..? అంటూ అసభ్యంగా మాట్లాడిన చరిత్ర ఆయనకుంది.
తాజాగా మరోసారి చింతకాయల అదే తరహాలో అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. సీఎంను చెత్తనాకొడుకు అంటూ మాట్లాడారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పర్యటించిన చింతకాయల.. చెత్తపై పన్ను వేసే వాడిని చెత్తనాకొడుకు అనక ఇంకేమనాలి అని ప్రశ్నించారు. మరో 8 నెలల్లో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అవుతున్నారని.. అప్పుడు ఈ పోలీసులంతా వచ్చి తమ చంకలు నాకుతారంటూ అసభ్యంగా, అనుచితంగా మాట్లాడారు.
తనకు చంద్రబాబు హోంశాఖ అప్పగిస్తే.. ఇప్పుడు ఏ పోలీసులైతే దౌర్జన్యం చేస్తున్నారో ఆ నాకొడుకుల పేర్లన్నీ రాసుకుని వారి అంతు చూస్తా అంటూ హెచ్చరించారు. రోజా తనను మగాడు కాదంటూ మాట్లాడుతోందని.. తాను మగాడినో కాదో ఆమెకు ఎలా తెలుసంటూ మాట్లాడారు. ఒకసారి రోజా వచ్చి చూస్తే తాను మగాడినో కాదో తెలుస్తుందన్నారు. గెలిచిన ఏడాదిలోనే మద్యం షాపులన్నీ తీసేస్తామన్న జగన్.. ఇప్పుడు ఏకంగా 25ఏళ్లకు మద్యాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇలాంటి వాటిని ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతారా?.. పెట్టుకోరా .. ఏం పీకుతావో పీక్కో అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చింతకాయల రెచ్చిపోయారు.
చింతకాయల చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. టీడీపీ అధికారంలోకి వస్తే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ద్వారా పోలీసుల సంగతి తేలుస్తామని, దౌర్జన్యం చేస్తున్న పోలీసులంతా తమ చంకలు నాకాలి అంటూ అయ్యన్న మాట్లాడటాన్ని తప్పుపట్టింది. అయ్యన్నపాత్రుడు తక్షణమే క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారుల సంఘం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఏ మాత్రం బాధ్యత లేని ఇలాంటి వ్యక్తులు గతంలో మంత్రులుగా కూడా పనిచేయడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని సంఘం విమర్శించింది.